STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 4:29 pm Posted by : ARUN

Sobhita Dhulipala:ఇండస్ట్రీలోకి రావాలంటే భయానకమే..కానీ!

సినీ పరిశ్రమలో ఎలాంటి పరిచయాలు, పలుకుబడి లేకుండా అడుగుపెట్టడం చాలా కష్టమైన అనుభవమని నటి శోభిత ధూళిపాళ వెల్లడించింది. పరిశ్రమలో తనకు మార్గనిర్దేశం చేసేవారు, అండగా నిలిచేవారు ఎవరూ లేరని గుర్తుచేసుకుంది. మోడలింగ్ నేపథ్యం కూడా కొన్ని సందర్భాల్లో తనకు ప్రతికూలంగా మారిందని తెలిపింది.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శోభిత తన సినీ ప్రయాణంలోని కష్టాలను పంచుకుంది. విశాఖపట్నం నుంచి ముంబైకి వెళ్లిన శోభిత.. చదువుకుంటూనే మోడలింగ్ రంగంలో కొనసాగింది. 2013లో మిస్ ఇండియా ఎర్త్ కిరీటాన్ని గెలుచుకుంది. ఈ విజయం ద్వారా ర్యాంప్ మోడలింగ్‌లో అవకాశాలు వస్తాయని తద్వారా సినిమాల్లోకి ప్రవేశించవచ్చని ఆశించింది. అయితే ఆ పోటీలో గెలవడం కూడా తనకు కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టిందని చెప్పింది.

నన్ను కాపాడటానికి లేదా అవకాశాలు ఇప్పించడానికి గాడ్‌ఫాదర్‌గానీ, గాడ్‌మదర్‌గానీ ఎవరూ లేరు. పరిశ్రమలో బయటి వ్యక్తిగా అడుగుపెట్టినప్పుడు ఏం చేయాలో తెలియక మనమే అన్నీ నేర్చుకోవాలి. ఎలాంటి సమాచారం, మార్గదర్శకత్వం ఉండదు. ఆ పరిస్థితి చాలా భయాన్ని కలిగిస్తుంది అని చెప్పుకొచ్చింది. ఎన్నో ఆడిషన్ల తర్వాత దర్శకుడు అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన ‘రామన్ రాఘవ్ 2.0’ చిత్రంలో తొలిసారి నటించే అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా కారణంగా 2016లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లే అవకాశం కూడా లభించింది అని వెల్లడించింది.

ఎన్నో ఆడిషన్లు ఇచ్చిన తర్వాత తొలి అవకాశం వచ్చింది. కేన్స్‌కు వెళ్లాను. ఎంతోమంది ప్రతిభావంతులను కలిశాను. ప్రతి అనుభవం నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. ఒక దశలో మనకు అర్థమవుతుంది.. ఈ పరిశ్రమలో ఎవరైనా ఏదైనా సాధించగలరని. ఇతరుల గుర్తింపు కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదని తెలుసుకున్నప్పుడు మనకు స్వేచ్ఛ లభిస్తుంది. మనం సరిపోతామని ఎవరైనా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ స్థాయికి చేరుకోవడానికి ధైర్యం, కృషి, సమయం అవసరం అని శోభిత పేర్కొంది.