దక్షిణాది సినిమాలపై బాలీవుడ్ నటీమణులు జాన్వీ కపూర్, రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలపై నటి రెజీనా కాసాండ్రా స్పందించారు. ఈ వ్యాఖ్యలు ఉత్తరాది, దక్షిణాది చిత్ర పరిశ్రమల మధ్య విభేదాలను పెంచేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఒక సినిమాలో తమ పాత్ర చిత్రీకరణ పట్ల అసౌకర్యంగా భావిస్తే ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకునే అవకాశం ఉన్నప్పుడు అలా చేయాలని నటీనటులకు సూచించారు. అంతేకానీ తమకు మరో మార్గం లేదని చెప్పడం సరికాదని వ్యాఖ్యానించారు.
ఓ ఇంటర్వ్యూలో రెజీనా మాట్లాడుతూ.. ఒక సినిమాలో తమ పాత్ర పట్ల అసౌకర్యంగా ఉంటే దాని నుంచి బయటకు రావాలని అన్నారు. ముఖ్యంగా జాన్వీ కపూర్, రాధికా ఆప్టే వంటి స్థాయిలో ఉన్న నటీమణులకు సినిమా నుంచి తప్పుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇది పురుషులు, మహిళలకు సంబంధించిన సమస్యగా చూడకూడదని, మహిళగా తాను సహజంగానే మహిళల పక్షాన నిలుస్తానని చెప్పారు. అయితే ప్రతి అంశాన్ని ఉత్తరాది, దక్షిణాది కోణంలో చూడటం సరైంది కాదన్నారు.
అలాగే కేసరి 2 సినిమా ప్రమోషన్ల సమయంలో తనను పట్టించుకోలేదని రెజీనా ఆరోపించారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ భార్య పాత్రలో ఆమె నటించారు. అయితే సినిమా ప్రమోషన్లలో ధర్మ ప్రొడక్షన్స్ తనకు తగిన గుర్తింపు ఇవ్వలేదని సోషల్ మీడియాలో తనను ట్యాగ్ కూడా చేయలేదని వెల్లడించారు. ఇక ఉత్తరాది నటీనటులు దక్షిణాది సినిమా పరిశ్రమ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాంటి వ్యాఖ్యలు తెలియకుండానే నార్త్–సౌత్ విభజనకు దారితీస్తాయని అన్నారు.