భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పండుగల్లో దీపావళి ఒకటి. దీపావళి సందర్భంగా ఇళ్లను దీపాలతో అలంకరించి, టపాసులు కాల్చి, దేవుళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా దీపావళి రోజున లక్ష్మీదేవి, వినాయకుడిని కలిపి పూజించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే సంపదకు ప్రతీక అయిన లక్ష్మీదేవితో పాటు విఘ్నాలను తొలగించే వినాయకుడిని ఎందుకు పూజిస్తారు? దీని వెనుక ఉన్న పురాణ కథ ఏమిటో తెలుసుకుందాం.
దీపావళి పండుగను శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసం ముగించుకుని, సీతమ్మ, లక్ష్మణుడితో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా జరుపుకుంటారని పురాణ కథనాలు చెబుతాయి. శ్రీరాముడి రాకను స్వాగతిస్తూ అయోధ్య ప్రజలు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. అప్పటి నుంచి దీపావళి వేడుకల్లో దీపాలు వెలిగించడం, ఇళ్లను అలంకరించడం, ప్రత్యేక పూజలు చేయడం సంప్రదాయంగా కొనసాగుతోంది.
లక్ష్మీదేవిని సంపద, శ్రేయస్సు, అదృష్టం, సంతోషానికి ప్రతీకగా భావిస్తారు. ఆమె అనుగ్రహం ఉంటే ఇంట్లో ఐశ్వర్యం, ఆనందం వెల్లివిరుస్తాయని భక్తుల విశ్వాసం. మరోవైపు వినాయకుడిని విఘ్నాలను తొలగించే దేవుడిగా పూజిస్తారు. ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు గణపతిని పూజించడం హిందూ సంప్రదాయంలో ముఖ్యమైన ఆచారం.
దీపావళి రాత్రి లక్ష్మీదేవి ఇళ్లకు వచ్చి భక్తులను ఆశీర్వదిస్తుందని, సంపద, సంతోషం, అదృష్టాన్ని ప్రసాదిస్తుందని ప్రజలు విశ్వసిస్తారు. అందుకే దీపావళి సందర్భంగా లక్ష్మీపూజకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. పూజకు ముందు ఇళ్లను శుభ్రం చేసి, రంగురంగుల ముగ్గులు వేసి, దీపాలతో అలంకరిస్తారు. కొత్త దుస్తులు ధరించి భక్తిశ్రద్ధలతో అమ్మవారిని, వినాయకుడిని పూజిస్తారు.
లక్ష్మీదేవి, వినాయకుడిని కలిపి పూజించడం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ కథ ప్రచారంలో ఉంది. ఒకసారి లక్ష్మీదేవికి మాతృత్వంలోని ఆనందాన్ని అనుభవించాలని కోరిక కలిగిందట. ఈ విషయాన్ని పార్వతీదేవికి చెప్పగా.. ఆమె తన కుమారుడైన వినాయకుడిని లక్ష్మీదేవికి దత్తపుత్రుడిగా ఇచ్చిందని కథనం.
దీంతో ఎంతో సంతోషించిన లక్ష్మీదేవి వినాయకుడికి తన దివ్యశక్తులన్నింటినీ ప్రసాదించిందని పురాణ కథ చెబుతుంది. అప్పటి నుంచి వినాయకుడిని లక్ష్మీదేవితో కలిపి పూజించే సంప్రదాయం ప్రారంభమైందని విశ్వాసం. దీపావళి రోజున ముందుగా గణపతిని, అనంతరం లక్ష్మీదేవిని పూజిస్తే ఇంట్లో సంపద, అదృష్టం, విజయం కలుగుతాయని భక్తులు నమ్ముతారు.