STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 10:22 am Posted by : ARUN

Sachin Tendulkar:సచిన్‌కు ఇష్టమైన కెప్టెన్లు ఎవరో తెలుసా?

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో ఎంతోమంది గొప్ప కెప్టెన్ల నాయకత్వంలో ఆడారు. భారత జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు సచిన్. అయితే కెప్టెన్‌గా అంతగా రాణించలేకపోయిన సచిన్.. సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ సారథ్యంలో తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన కెప్టెన్లు ఎవరో సచిన్ వెల్లడించారు.

రెడ్డిట్ వేదికగా ఓ అభిమాని సచిన్‌ను పలు ప్రశ్నలు అడిగారు. భారత టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం ఎలా ఉంది? ఆ బాధ్యతలకు అలవాటు పడటం ఎంత కష్టమైంది? టెస్టుల్లో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా నాయకత్వంపై మీ అభిప్రాయం ఏమిటి? మీరు ఆడిన కెప్టెన్లలో వ్యక్తిగతంగా ఎవరంటే ఎక్కువ ఇష్టం? అని ప్రశ్నించారు.

దీనికి సచిన్ స్పందిస్తూ.. భారత జట్టుకు నాయకత్వం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. అయితే తన కెప్టెన్సీ సమయంలో జట్టును పూర్తిగా తనకు నచ్చిన విధంగా ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఎప్పుడూ ఉండేది కాదని చెప్పారు. 1990వ దశకంతో పోలిస్తే ప్రస్తుతం బీసీసీఐ మరింత పటిష్టంగా ఉందని.. కానీ ఆ సమయంలో భారత క్రికెట్ కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొందని గుర్తుచేశారు.

ఇక తనకు ఇష్టమైన కెప్టెన్ల విషయానికి వస్తే.. సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ తన జాబితాలో అగ్రస్థానంలో ఉంటారని స్పష్టం చేశారు. గంగూలీ నాయకత్వంలో 2003 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఆడిన సచిన్.. ధోనీ కెప్టెన్సీలో 2011లో ప్రపంచకప్ ట్రోఫీని అందుకున్నారు.టెంబా బవుమా పోరాట స్ఫూర్తిని తాను ఎంతో గౌరవిస్తానని సచిన్ పేర్కొన్నారు. జట్టును ముందుండి నడిపిస్తూ దక్షిణాఫ్రికా క్రికెట్‌కు అద్భుతమైన విజయాలు అందించారని ప్రశంసించారు.

సచిన్ 1996 నుంచి 2000 మధ్య  25 టెస్టు మ్యాచ్‌లకు భారత కెప్టెన్‌గా వ్యవహరించారు సచిన్. 2000 మార్చిలో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్ ఓటమి అనంతరం కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 2007లో మరోసారి టెస్టు కెప్టెన్సీ చేపట్టే అవకాశాన్ని తిరస్కరించడంతో ఆ బాధ్యతలు ఎంఎస్ ధోనీకి అప్పగించారు.