రాజస్థాన్‌లోని మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా చురులోని పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ జరిగినట్లు మరో ఫిర్యాదు నమోదైంది. జూనియర్ విద్యార్థులను లైంగికంగా అవమానించడంతో పాటు బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో ఆరోపించారు. ఈ నేపథ్యంలో జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) కళాశాల యాజమాన్యాన్ని తక్షణమే చర్యల నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
కళాశాల ప్రిన్సిపల్, డీన్‌ను సంప్రదించిన ఎన్‌ఎంసీ.. ఫిర్యాదులోని ఆరోపణలను తీవ్రంగా పరిగణించాలని స్పష్టం చేసింది. అక్టోబర్ ప్రారంభం నుంచి రాజస్థాన్‌లోని మెడికల్ కాలేజీల్లో నమోదైన ర్యాగింగ్ ఫిర్యాదుల్లో ఇది 13వ ఘటనగా తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు కేవలం రెండు కళాశాలల్లో మాత్రమే ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులపై చర్యలు తీసుకున్నారు.
బార్మర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 79 మంది విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా కొందరిని హాస్టళ్ల నుంచి శాశ్వతంగా తొలగించగా మరికొందరిని సస్పెండ్ చేశారు. జోధ్‌పూర్‌లోని డాక్టర్ ఎస్‌ఎన్ మెడికల్ కాలేజీలోనూ జూనియర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు తేలడంతో ఓ జూనియర్ రెసిడెంట్ సహా 19 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు.
చురు కళాశాల ఘటనలో బాధితుల జుట్టు బలవంతంగా కత్తిరించడం, బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు చేశారు. ర్యాగింగ్‌పై ఫిర్యాదు చేస్తే కళాశాల కార్యక్రమాల నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించినట్లు ఆరోపించారు.ర్యాగింగ్‌ను అరికట్టేందుకు యూజీసీ నిబంధనలు, ఎన్‌ఎంసీ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని బాధితులు కోరుతున్నారు. ఫిర్యాదు చేసిన విద్యార్థులకు కౌన్సెలింగ్, భద్రత కల్పించాలని, వారిపై ప్రతీకార చర్యలు జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మరోవైపు దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో పెరుగుతున్న ర్యాగింగ్ ఫిర్యాదులపై యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ స్పందించింది. ఈ వ్యవహారంలో తక్షణ జోక్యం చేసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి, రాష్ట్ర డీజీపీకి లేఖ రాసినట్లు ఆ సంస్థ కార్యదర్శి లక్ష్య మిట్టల్ తెలిపారు.