STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 6:35 pm Posted by : ARUN

Kavitha:తెలంగాణ నీటి హక్కులు ఏపీకి తాకట్టు..రేవంత్‌ సర్కార్‌పై కవిత ఫైర్

పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు అంగీకారం తెలపడం ద్వారా తెలంగాణ నీటి ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్‌కు తాకట్టు పెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత  విమర్శించారు. గోదావరి నదిలో తెలంగాణకు దక్కాల్సిన 250 టీఎంసీల నీటి వాటాను తన రాజకీయ గురువు, ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణగా రేవంత్ రెడ్డి సమర్పించుకుంటున్నారని ఆరోపించారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని మండిపడ్డారు.

నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశంలో పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపిందని కవిత పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. గోదావరి-కావేరి నదుల అనుసంధానాన్ని సమ్మక్క సాగర్ (తుపాకులగూడెం) నుంచి చేపట్టాలని ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశాల్లో అధికారులు సూచించినట్లు తెలిపారు. అయితే  బనకచర్ల ప్రాజెక్టుకు అనుకూలంగా నదుల అనుసంధానం జరిగేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.

దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశంలోనే కాకుండా, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య జరిగిన సమావేశంలోనూ పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు రేవంత్ రెడ్డి అంగీకారం తెలిపారని కవిత ఆరోపించారు. ముఖ్యమంత్రి ఆమోదం కారణంగానే ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నదుల అనుసంధానంలో భాగంగా చేపట్టేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తోందని పేర్కొన్నారు. ఒకవైపు ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నట్లు మీడియా ముందు చెబుతూ మరోవైపు సమావేశాల్లో అంగీకారం తెలపడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.

2024లోనే హెచ్చరించాం

పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు తెలంగాణ నీటి హక్కులకు నష్టం కలిగిస్తుందని తాము మొదటి నుంచీ హెచ్చరిస్తున్నామని కవిత గుర్తుచేశారు. 2024లోనే తెలంగాణ జాగృతి తరఫున ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు.

బనకచర్ల ప్రాజెక్టును బహిరంగంగా వ్యతిరేకిస్తున్నామని చెబుతూనే, అంతర్గతంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు ప్రభుత్వ నీటి విధానంపై అనుమానాలు కలిగిస్తున్నాయని అన్నారు. నదీ జలాల వినియోగంపై ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన, నిర్దిష్టమైన కార్యాచరణ లేకపోవడం తెలంగాణకు నష్టదాయకమని వ్యాఖ్యానించారు.

 

కేంద్రంతో చర్చల నుంచి వైదొలగాలి

పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎదురయ్యే నష్టాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా గుర్తించాలని కవిత కోరారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నిర్వహిస్తున్న అన్ని సంప్రదింపులు, చర్చల నుంచి తెలంగాణ ప్రభుత్వం తక్షణమే వైదొలగాలని డిమాండ్ చేశారు.

ప్రాజెక్టును అడ్డుకోవాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి లేఖ రాయాలని సూచించారు. తెలంగాణ నీటి హక్కులు, ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీకి తావులేదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి అన్యాయం జరిగేలా ఎవరైనా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు.