ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జాన్సన్‌ను వెనక్కి నెట్టి నంబర్ వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్టు అనంతరం ఐసీసీ తాజాగా ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ మ్యాచ్‌లో స్టార్క్ మొత్తం తొమ్మిది వికెట్లు పడగొట్టగా.. జాన్సన్ మూడు వికెట్లు మాత్రమే తీశాడు.
కేప్‌టౌన్ టెస్టులో ఆస్ట్రేలియా 176 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో స్టార్క్ తొలి ఇన్నింగ్స్‌లో 72 పరుగులిచ్చి ఆరు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 65 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించాడు. అయితే జట్టు ఓడిపోయినప్పటికీ అతడి అద్భుత బౌలింగ్ ప్రదర్శన ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని తిరిగి సాధించేందుకు దోహదపడింది. మరోవైపు జాన్సన్ గత వారం తొలిసారి టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌లో మూడు టెస్టుల్లో 198 పరుగులు చేయడంతో పాటు 13 వికెట్లు పడగొట్టిన అతడికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా లభించింది.
దక్షిణాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్ కేప్‌టౌన్ టెస్టులో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 10 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. దీంతో ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఏకంగా తొమ్మిది స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో 817 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. దక్షిణాఫ్రికా స్పిన్నర్లలో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన రెండో బౌలర్‌గా హార్మర్ నిలిచాడు. ఈ జాబితాలో హ్యూ టేఫీల్డ్ 895 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. 1957 ఫిబ్రవరిలో అతడు ఈ ఘనత సాధించాడు.
ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లోనూ హార్మర్ మూడు స్థానాలు మెరుగుపరుచుకుని ఐదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఈ జాబితాలో మార్కో జాన్సన్ అగ్రస్థానంలో ఉండగా.. దక్షిణాఫ్రికాకే చెందిన వియాన్ ముల్డర్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. భారత్‌కు చెందిన రవీంద్ర జడేజా రెండో స్థానంలో, బంగ్లాదేశ్ ఆటగాడు మెహిదీ హసన్ నాలుగో స్థానంలో ఉన్నారు.