STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 8:49 pm Posted by : AMAR

PJR ఇండోర్ స్టేడియంలో ‘కలరిపయట్టు’ పోటీల ఏర్పాట్లు పరిశీలన

చందానగర్ : రాబోయే ప్రతిష్టాత్మక ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ నేషనల్ ఫైనల్స్ కలరిపయట్టు పోటీలకు వేదిక కానున్న చందానగర్‌లోని పీజేఆర్ (PJR) ఇండోర్ స్టేడియంను సోమవారం పలువురు ప్రముఖ క్రీడాధికారులు, సాంకేతిక నిపుణులు సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్శనలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) సీనియర్ అథ్లెటిక్స్ కోచ్ డాక్టర్ G.V. సుబ్బారావు, ఇండియన్ కలరిపయట్టు ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ & టెక్నికల్ కమిటీ సభ్యులు P.E. శ్రీజయన్ గురుక్కల్, టెక్నికల్ కమిటీ సభ్యులు అంబరీష్ గురుక్కల్లతో పాటు కలరిపయట్టు అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రధాన కార్యదర్శి రమేష్, కోశాధికారి డాక్టర్ ఆది భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

స్టేడియం సందర్శన సందర్భంగా అధికారులు పోటీల నిర్వహణకు సంబంధించిన మైదాన ఏర్పాట్లు, లైటింగ్, డ్రెస్సింగ్ రూమ్‌లు మరియు క్రీడాకారులకు కల్పిస్తున్న మౌలిక సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. దేశ నలుమూలల నుండి విచ్చేసే యోధులు, క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అత్యుత్తమ ప్రమాణాలతో ఏర్పాట్లు పూర్తి చేయాలని, సాంకేతిక నిబంధనలకు అనుగుణంగా పోటీ వేదికను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

జాతీయ స్థాయిలో నగరంలో జరుగుతున్న ఈ పోరాట కళల (కలరిపయట్టు) పోటీలు క్రీడాభిమానులకు విశేష అనుభూతిని అందిస్తాయని నిర్వాహకులు ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.