STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 11:45 am Posted by : ARUN

TRS:కొడంగల్‌లో కవిత పార్టీకి పెరుగుతున్న ఆదరణ.. రేవంత్‌కు ప్రత్యామ్నాయంగా రాజప్రభాకర్!

తెలంగాణ రాజకీయాల్లో కొడంగల్ నియోజకవర్గం మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) క్రమంగా తన రాజకీయ కార్యకలాపాలను విస్తరిస్తోంది. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇటీవల కోస్గిలో నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప సభ’కు వచ్చిన స్పందన స్థానిక రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ సభ విజయవంతం కావడంలో కొడంగల్ పార్టీ ఇన్‌ఛార్జి రాజప్రభాకర్ కీలకంగా వ్యవహరించారు.

స్థానికుడిగా, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా రాజప్రభాకర్ రావుకు నియోజకవర్గంలో మంచి గుర్తింపు ఉంది. రైతుల సమస్యలు, బలవంతపు భూసేకరణ, సామాన్య ప్రజల ఇబ్బందులపై ఆయన చురుగ్గా స్పందిస్తున్నారని స్థానికంగా ప్రచారంలో ఉంది. ముఖ్యంగా స్థానిక సమస్యలపై ప్రజల తరఫున గళం వినిపించడం ద్వారా రాజకీయంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డికి బలమైన ప్రత్యర్థిగా రాజప్రభాకర్ రావు నిలిచే అవకాశం ఉందనే చర్చ కూడా స్థానికంగా మొదలైంది.

కొడంగల్ ప్రజలకు స్థానికంగా ఉపాధి, వలసల నివారణ వంటి అంశాలను హైలైట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. స్థానికంగానే ఉపాధి అవకాశం వంటి అంశాలను తన రాజకీయ కార్యాచరణలో కీలకంగా ముందుకు తీసుకెళ్తున్నారు.

కవిత ప్రసంగానికి సీఎం నినాదాలు

కోస్గి సభలో కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదని, బహుజనుల బాణాన్ని అని ప్రకటించారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్, ప్రధాని మోదీతోనైనా పోరాడేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. ప్రజల ఆశీర్వాదం ఉంటే భవిష్యత్తులో ముఖ్యమంత్రి కూడా అవుతానని ధీమా వ్యక్తం చేశారు. ఆమె ప్రసంగిస్తున్న సమయంలో సభా ప్రాంగణం సీఎం.. సీఎం.. నినాదాలతో మార్మోగింది.

దీనికి తోడు సీఎం రేవంత్‌…అభివృద్ధి పేరిట రైతుల నుండి బలవంతపు భూసేకరణ చేస్తుండటం ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. అలాగే సీఎం సొంత నియోజకవర్గంలో పత్తి రైతులు ధర్నా చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దౌల్తాబాద్ మండలం నీటూర్ గేటు వద్ద ఉన్న విజయ్ ఇండస్ట్రీస్ పత్తి మిల్లు ఎదుట రైతులు గిట్టుబాటు ధర కోసం ఆందోళనకు దిగారు. మిల్లు యాజమాన్యం క్వింటాల్ పత్తికి రూ.8,900 నుంచి రూ.9,200 వరకు మాత్రమే చెల్లిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

ఈ పరిణామాల నేపథ్యంలో కొడంగల్‌లో రైతుల సమస్యలు, స్థానిక ఉపాధి, భూసేకరణ అంశాలు రాజకీయ చర్చకు కేంద్రంగా మారుతున్నాయి. ఈ సమస్యలపై రాజప్రభాకర్ రావు మరింత చురుగ్గా స్పందిస్తుండటం, కవిత సభకు లభించిన స్పందనతో తెలంగాణ రక్షణ సేన నియోజకవర్గంలో తన ఉనికిని బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. మొత్తంగా రాబోయే రోజుల్లో కొడంగల్ రాజకీయాల్లో ఈ పరిణామాలు ఎలాంటి మార్పులకు దారితీస్తాయో వేచి చూడాలి.