భారతీయుల ఆహారంలో అన్నానికి ప్రత్యేక స్థానం ఉంది. పప్పు అన్నం నుంచి పెరుగు అన్నం వరకు రోజువారీ భోజనంలో బియ్యం ప్రధాన భాగంగా ఉంటుంది. అయితే మధుమేహం రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది అన్నం తినాలా? వద్దా? అనే సందేహంతో ఉంటున్నారు. ముఖ్యంగా తెల్ల బియ్యానికి బదులుగా రాగులు తింటే షుగర్ నియంత్రణలో ఉంటుందా? అనే ప్రశ్న తరచూ ఎదురవుతోంది.
రాగుల్లో ఫైబర్, కాల్షియం, ఇతర పోషకాలు ఎక్కువగా ఉండటంతో ఆరోగ్యకరమైన ఆహారంగా గుర్తింపు ఉంది. అయితే రాగుల్లో కార్బోహైడ్రేట్లు ఉండవని వాటిని తింటే రక్తంలో చక్కెర పెరగదని భావించడం సరికాదని నిపుణులు చెబుతున్నారు. బియ్యం, గోధుమలు, రాగులు, చిరుధాన్యాలు.. ఇవన్నీ ప్రధానంగా కార్బోహైడ్రేట్లు అందించే ఆహార పదార్థాలే. ఒక ధాన్యానికి బదులుగా మరో ధాన్యాన్ని ఎంచుకున్నంత మాత్రాన భోజనం మధుమేహానికి అనుకూలంగా మారదని స్పష్టం చేస్తున్నారు.
ఆహారంలో ఉండే పోషకాలతో పాటు ఎంత పరిమాణంలో తింటున్నాం? వాటితోపాటు ఇంకేం తీసుకుంటున్నాం? అనే అంశాలు కూడా రక్తంలో గ్లూకోజ్ స్థాయులపై ప్రభావం చూపుతాయని చెప్పారు. ఏ ధాన్యం తినాలనే దానికంటే రోజువారీ భోజనంలో వివిధ ఆహార పదార్థాలు ఎంత మోతాదులో ఉండాలన్నది ముఖ్యం.
50 శాతం: ఆకుకూరలు, ఇతర పిండి పదార్థాలు తక్కువగా ఉండే కూరగాయలు.
25 శాతం: పప్పులు, చిక్కుళ్లు, పనీర్, చేపలు, గుడ్లు లేదా తక్కువ కొవ్వు కలిగిన మాంసం వంటి ప్రోటీన్ ఆహారాలు.
25 శాతం: అన్నం, చపాతీ, రాగులు, ఇతర చిరుధాన్యాలు వంటి కార్బోహైడ్రేట్లు అందించే పదార్థాలు.
ఈ పద్ధతితో కూరగాయలు, ప్రోటీన్ తీసుకోవడం పెరుగుతుందని కార్బోహైడ్రేట్ల పరిమాణం కూడా నియంత్రణలో ఉంటుందని వివరించారు.
చాలామంది భోజనంలో అన్నం లేదా చపాతీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. దీంతో కూరగాయలు, ప్రోటీన్ తీసుకునే అవకాశం తగ్గుతుంది. కూరగాయల ద్వారా శరీరానికి ఫైబర్, అవసరమైన పోషకాలు అందుతాయి. ప్రోటీన్ కండరాల ఆరోగ్యానికి తోడ్పడటంతో పాటు ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. కార్బోహైడ్రేట్లతోపాటు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్ పెరిగే వేగాన్ని కొంతవరకు నియంత్రించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మధుమేహం ఉన్నవారు అన్నాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే ఎంత పరిమాణంలో తింటున్నారు? భోజనంలో ఇతర ఆహార పదార్థాల నిష్పత్తి ఎలా ఉంది? తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయులు ఎలా మారుతున్నాయి? అనే అంశాలను గమనించాలని సూచించారు. రాగులు కూడా పోషక విలువలు కలిగిన ఆహారమే అయినప్పటికీ, వాటిని డయాబెటిస్‌కు మందుగా లేదా షుగర్‌ను కచ్చితంగా నియంత్రించే పదార్థంగా భావించకూడదని స్పష్టం చేశారు.