హైదరాబాద్:సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని ట్రేడింగ్‌లో పెట్టుబడుల పేరుతో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ను నిండా ముంచేశారు సైబర్ కేటుగాళ్లు. అధిక లాభాల ఆశ చూపించి విడతలవారీగా రూ.29.20 లక్షలు పెట్టుబడులు పెట్టించింది. చివరకు లాభాలు, పెట్టుబడి సొమ్ము విత్‌డ్రా చేసుకోవాలంటే మరో రూ.12 లక్షలు చెల్లించాలని చెప్పడంతో బాధితుడు మోసపోయినట్లు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌కు ఫేస్‌బుక్‌లో ‘సుకన్య రెడ్డి’ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దానిని అంగీకరించిన తర్వాత ఆమె తన వాట్సాప్ నంబర్‌ను ఇచ్చింది. దీంతో ఇద్దరి మధ్య పరిచయం పెరిగి, తరచూ చాటింగ్ చేసుకునేవారు. ఈ క్రమంలో సదరు మహిళ ‘డార్విన్ ఎక్స్ గ్లోబల్’ అనే ట్రేడింగ్ సంస్థ గురించి కానిస్టేబుల్‌కు వివరించింది. అందులో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని నమ్మించింది.
ఆమె మాటలు నమ్మిన కానిస్టేబుల్ తొలుత తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాడు. అందులో లాభాలు వచ్చినట్లు కనిపించడంతో పాటు కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే అవకాశం కూడా ఉండటంతో ఆమెపై నమ్మకం పెంచుకున్నాడు. దీంతో విడతలవారీగా మొత్తం రూ.29.20 లక్షలు పెట్టుబడిగా పెట్టాడు.
ఈ క్రమంలో తనకు రూ.76 లక్షల వరకు లాభాలు వచ్చాయని బాధితుడికి నమ్మబలికారు. అయితే ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవాలంటే ముందుగా రూ.12 లక్షలు ఫీజు చెల్లించాలని షరతు విధించారు. దీంతో అనుమానం వచ్చిన కానిస్టేబుల్ తాను మోసపోయినట్లు గుర్తించాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.
సోషల్ మీడియాలో పరిచయం లేని వ్యక్తులు అధిక లాభాల పేరుతో పెట్టుబడులు పెట్టాలని కోరితే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. పెట్టుబడి, లాభాల ఉపసంహరణ పేరుతో ముందస్తు ఫీజులు చెల్లించాలనే డిమాండ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.