STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 4:25 pm Posted by : ARUN

AP Muncipal Results:మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా..టీడీపీ గాలిలోనూ నందికొట్కూరులో బైరెడ్డి సత్తా

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీఏ కూటమి భారీ ఆధిక్యంతో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు ఫలితాలు ప్రకటించిన 1,959 వార్డుల్లో కూటమి ఏకంగా 1,743 స్థానాలను కైవసం చేసుకుంది. కూటమిలో తెలుగుదేశం పార్టీ అత్యధికంగా 1,438 వార్డుల్లో విజయం సాధించి ఆధిపత్యాన్ని చాటుకుంది. జనసేన పార్టీ 222, బీజేపీ 83 స్థానాలను గెలుచుకున్నాయి. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 188 వార్డుల్లో విజయం సాధించగా, వామపక్షాలు ఆరు, స్వతంత్ర అభ్యర్థులు 22 స్థానాలను దక్కించుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీల్లో ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 3,942 వార్డులకు సంబంధించి ఫలితాలు వెలువడాల్సి ఉంది. నవంబర్ 1న జరిగిన పోలింగ్‌లో 60.96 శాతం ఓటింగ్ నమోదైంది. గ్రేటర్ విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, అనంతపురం వంటి ప్రధాన నగరాల్లో ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

అయితే కూటమి గాలిలోనూ నందికొట్కూరులో తన సత్తాచాటారు వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి. నందికొట్కూరు మున్సిపాలిటీ వైసీపీ కైవసం చేసుకుంది. వైసీపీ 23 స్థానాల్లో గెలుపొందగా టీడీపీ 9 వార్డుల్లో విజయం సాధించింది.

తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన అనంతరం సాధారణ బ్యాలెట్ పత్రాలను వార్డులు, డివిజన్ల వారీగా వేరు చేసి 25 చొప్పున కట్టలుగా ఏర్పాటు చేశారు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధిలో ఇప్పటివరకు 120 వార్డులకు గాను 22 వార్డుల ఫలితాలు ప్రకటించారు. వీటిలో ఎన్డీఏ కూటమి 18 స్థానాలను గెలుచుకుంది. టీడీపీ 13, జనసేన 4, బీజేపీ ఒక వార్డును కైవసం చేసుకున్నాయి. వైఎస్సార్‌సీపీ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. మిగిలిన 98 వార్డుల ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది.

మొత్తం 3,942 వార్డులకు గాను 1,959 స్థానాల్లో ఫలితాలు ప్రకటించగా, కూటమి 1,743 వార్డుల్లో విజయం సాధించింది. ఇందులో టీడీపీ 1,438, జనసేన 222, బీజేపీ 83 స్థానాలను గెలుచుకున్నాయి. వైఎస్సార్‌సీపీ 188 వార్డులు, వామపక్షాలు ఆరు స్థానాలు దక్కించుకున్నాయి. సీపీఎం, సీపీఐ చెరో మూడు వార్డుల్లో గెలుపొందాయి. స్వతంత్ర అభ్యర్థులు 22 స్థానాల్లో విజయం సాధించారు. మిగిలిన 1,983 వార్డుల ఫలితాలు వెలువడాల్సి ఉంది.

మురాసు తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో విజయవాడ కార్పొరేషన్ కౌంటింగ్ ఇంకా మొదలు కాలేదు.అలాగే చీరాల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు వాయిదా పడింది.