తెలంగాణలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు గడువును పొడిగించాలని కోరగా ఎన్నికల అధికారులు సానుకూలంగా స్పందించారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. నవంబర్ 6తో ముగియనున్న ఓటరు నమోదు గడువును ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు కొనసాగించాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు తెలిపారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు తమ ఆలోచనలతో, వివేచనతో ఓటు వేస్తారని కవిత అన్నారు. ఇలాంటి ఎన్నికలు కొత్త రాజకీయ పార్టీలకు తమ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మంచి అవకాశమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ నవంబర్ 21 వరకు కొనసాగనున్న నేపథ్యంలో గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు గడువును కూడా పొడిగించాలని కోరినట్లు చెప్పారు. ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసే వరకు ఓటరు నమోదుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశామని దీనిపై అధికారులు సానుకూలంగా స్పందించారని వివరించారు.
అర్హులైన పట్టభద్రులందరూ పెద్ద సంఖ్యలో తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని కవిత పిలుపునిచ్చారు. ప్రభుత్వ విధానాలు, ప్రతిపక్షాల వైఖరిపై తమ తీర్పును వెల్లడించే అవకాశం విద్యావంతులకు ఈ ఎన్నికల ద్వారా లభిస్తుందని అన్నారు. తెలంగాణలోని ఆరు పాత జిల్లాల పరిధిలో, రాష్ట్రంలోని దాదాపు మూడింట రెండొంతుల ప్రాంతంలో ఈ ఎన్నికలు జరగనున్నాయని పేర్కొంటూ యువత ముఖ్యంగా జెన్‌జీ పెద్ద సంఖ్యలో నమోదు చేసుకోవాలని కోరారు.
ఇదే సమయంలో తమ పార్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఢిల్లీలో పెండింగ్‌లో ఉన్న ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కోరినట్లు కవిత తెలిపారు. తెలంగాణలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేసి ప్రజా సమస్యలపై కార్యక్రమాలు నిర్వహిస్తున్న తీరును ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. తమ పార్టీ రిజిస్ట్రేషన్ అంశంపై జాతీయ ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల అధికారి నివేదిక పంపించాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.
మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిసారీ కొత్తగా ఓటరు నమోదు చేసుకోవాల్సి రావడం వల్ల చాలామంది ఆసక్తి చూపడం లేదని కవిత అభిప్రాయపడ్డారు. గతంలో ఓటు వేసినవారు కూడా మళ్లీ నమోదు చేసుకోవాల్సి రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ రీ-రిజిస్ట్రేషన్ ప్రక్రియ అభ్యర్థులకు అదనపు ఖర్చును కూడా కలిగిస్తోందన్నారు. పెద్ద యూనివర్సిటీలు, కాలేజీల అధిపతులు పోటీలోకి దిగినప్పుడు ఓటర్ల జాబితా ఒక వర్గానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్నందున ఈ అంశంపై ఫిర్యాదులు చేయడం కంటే ఓటర్లను నమోదు చేయించి, తమ విధానాలను ప్రజలకు వివరించడంపైనే దృష్టి పెడతామని కవిత స్పష్టం చేశారు. అయితే దీర్ఘకాలంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు విధానంపై సమాజం, ఎన్నికల సంఘం సమగ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.