STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 02 November 2026, 4:23 pm Posted by : ARUN

నిరసనల్లో పాల్గొనే హక్కు లేదు..ఇమ్రాన్‌పై బాంబే హైకోర్టు

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డు ఉన్నంత మాత్రాన భారత్‌లో నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు లేదని తేల్చిచెప్పింది న్యాయస్థానం. మరో దేశంలో ఇలాంటి చర్యలకు పాల్పడితే ఇప్పటికే దేశం నుంచి బహిష్కరించి ఉండేవారని వ్యాఖ్యానించింది.

విదేశీయుల ప్రాంతీయ నమోదు కార్యాలయం (FRRO) జారీ చేసిన లీవ్ ఇండియా నోటీసును సవాల్ చేస్తూ ఇమ్రాన్ ఖాన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక కామెంట్స్ చేసింది.

విచారణ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. నటుడిని విచారణ కోసం ఇప్పటివరకు ఎప్పుడూ పిలవలేదని కోర్టుకు తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఆయన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారా లేదా అన్న విషయాన్ని నిరూపించాలని సూచించింది.

ఇమ్రాన్ ఖాన్ అమెరికా పాస్‌పోర్టు కలిగి ఉన్నారని….2006 నుంచి భారత్‌లోనే ఉంటూ పని కోసం ప్రయత్నిస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. నిరసన కార్యక్రమంలో పాల్గొనలేదని, భవిష్యత్తులోనూ అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనే ఉద్దేశం లేదని హామీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

అమెరికా సహా మరో దేశంలో ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే, తదుపరి విమానంలోనే వారిని దేశం నుంచి పంపించేవారని వ్యాఖ్యానించింది ధర్మాసనం. అలాగే భారత్‌లో నివసిస్తూ ఇక్కడే పని ఉంటున్న ఇమ్రాన్ ఖాన్ …భారత పౌరసత్వం కోసం ఎందుకు దరఖాస్తు చేసుకోలేదని ప్రశ్నించింది.