దేశవ్యాప్తంగా చేపడుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను కాంగ్రెస్ వ్యతిరేకించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో బీజేపీ నిర్వహించిన లోక్తంత్ర బచావో పాదయాత్ర అనంతరం జరిగిన సభలో అమిత్ షా ప్రసంగించారు
భారత్‌లోని బంగ్లాదేశీ చొరబాటుదారులను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఓటరు జాబితా నుంచి ప్రతి ఒక్క చొరబాటుదారుడి పేరును తొలగించేలా బీజేపీ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. భారత పౌరులకు మాత్రమే ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఉంటుందని అభివర్ణించిన అమిత్ షా… ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం ఇండియా కూటమి నిర్వహించిన సభను చొరబాటుదారులను కాపాడండి కార్యక్రమంగా అభివర్ణించారు. నకిలీ ఓట్లతో ఎన్నికలను గెలవాలని కాంగ్రెస్ చూస్తోందని విమర్శించారు.
ఈవీఎంలు సరిగా పనిచేయకపోతే తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎలా అయ్యారని…కేరళ, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎలా అధికారంలోకి వచ్చాయని అమిత్ షా ప్రశ్నించారు. గెలిచినప్పుడు ప్రజల తీర్పు అంటారని..ఓడిపోయినప్పుడు మాత్రం ఈవీఎంలను నిందిస్తారని విమర్శించారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో రూ.12 లక్షల కోట్ల విలువైన కుంభకోణాలు, అవినీతి జరిగాయని ఆరోపించారు.
ఒక వ్యక్తికి రెండు ఓట్లు ఉంటే అందులో ఒక ఓటును తొలగించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. సుమారు మూడు కోట్ల ఓట్లు ఉన్నప్పటికీ ఆ ఓట్లకు సంబంధించిన వ్యక్తులే లేరని వారంతా బంగ్లాదేశీ చొరబాటుదారులని అమిత్ షా ఆరోపించారు. ఈ విషయంపైనే రాహుల్ గాంధీకి బాధ కలుగుతోందని వ్యాఖ్యానించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అమిత్ షా తెలిపారు. అయితే రాహుల్ గాంధీ సభ సజావుగా సాగాలని కోరుకోవడం లేదని విమర్శించారు. పార్లమెంట్ సజావుగా జరిగితే ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలో ప్రతిపక్ష నేత ఓడిపోతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్‌పై ఉందని ఎద్దేవా చేస్తూ.. మోదీతో మారథాన్‌లో పోటీ పడే స్థితిలో ఆ పార్టీ లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ బీజేపీ యువమోర్చా అధ్యక్షుడితో పోటీ పడినా రాహుల్ గాంధీ ఓడిపోతారని అన్నారు.
రేవంత్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌కు ఏటీఎంలా మార్చారని ఆరోపించారు. ఎస్ఐఆర్ను వ్యతిరేకించినంత మాత్రాన ఆ ప్రక్రియను అడ్డుకోలేరని అన్నారు. రాష్ట్రంలో అవినీతిని అడ్డుకోవడంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, బీఆర్ఎస్ విఫలమయ్యాయని విమర్శించారు.
రాహుల్ గాంధీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదని అమిత్ షా ఆరోపించారు. ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని ప్రధాని మోదీ ఇచ్చిన హామీ మేరకు సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులు, ఆపరేషన్ సిందూర్ ద్వారా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. 2029 డిసెంబర్ 31లోపు దేశం నుంచి మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించి భారత్‌ను డ్రగ్స్ రహిత దేశంగా మారుస్తామని మరోసారి స్పష్టం చేశారు.