ఒకప్పుడు జుట్టు లేదా గడ్డంలో తెల్ల వెంట్రుకలు కనిపించగానే వాటిని రంగులతో కప్పిపుచ్చుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తెల్లజుట్టు, తెల్లగడ్డం వయసుకు సంకేతాలుగా కాకుండా ప్రత్యేకమైన శైలి, ఆత్మవిశ్వాసానికి ప్రతీకలుగా మారుతున్నాయి. సహజమైన రూపాన్ని దాచకుండా అందంగా మలుచుకోవడానికే యువత ఆసక్తి చూపుతోంది. సినీ ప్రముఖులు, అంతర్జాతీయ నమూనా కళాకారులు ప్రదర్శిస్తున్న సాల్ట్ అండ్ పెప్పర్ రూపం ఈ మార్పుకు మరింత ప్రాచుర్యం తెస్తోంది. దీంతో కళాశాల విద్యార్థులు, ఉద్యోగులు కూడా వెండి, బూడిద, ప్లాటినం రంగులతో కొత్త రూపాలను ప్రయత్నిస్తున్నారు.
ఈ మార్పు వెనుక అందంతో పాటు వ్యక్తిత్వాన్ని ధైర్యంగా ప్రదర్శించాలనే ఆలోచన కూడా ఉందని ఫ్యాషన్ వర్గాలు భావిస్తున్నాయి. చక్కగా తీర్చిదిద్దిన తెల్లగడ్డం, అందంగా దువ్విన వెండి రంగు జుట్టు పురుషులకు ప్రత్యేకమైన ఆకర్షణను అందిస్తున్నాయి. మహిళలు సైతం వెండి రంగు జుట్టును తమదైన శైలిలో ప్రదర్శిస్తున్నారు. రసాయన రంగులతో సహజమైన మార్పులను దాచాల్సిన అవసరం లేదనే అభిప్రాయం పెరుగుతోంది. అందం అంటే నల్లజుట్టే కావాలనే పాత ఆలోచనకు భిన్నంగా, సహజత్వాన్ని స్వీకరించడం కూడా ఫ్యాషన్‌లో భాగమవుతోంది.