STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 12:20 am Posted by : START TRINETHRAM

జ్వరంతో బాధపడినా వెనక్కి తగ్గని హర్మన్‌ప్రీత్.. బరిలో శతకం

జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది. మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి జ్వరంతో బాధపడినప్పటికీ, మందులు తీసుకుని మైదానంలోకి దిగినట్లు ఆమె వెల్లడించింది. తొలుత ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో ఇబ్బంది ఎదురైందని, విశ్రాంతి తీసుకోవాలనుకున్నా నొప్పి నివారణ మందులు కొంత ఉపశమనం కలిగించాయని తెలిపింది. అనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా దాదాపు 43 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ 121 బంతుల్లో 126 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. మరోవైపు దీప్తి కూడా శతకంతో రాణించడంతో భారత్‌కు తిరుగులేకుండా పోయింది.

ఇటీవలే భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న హర్మన్‌ప్రీత్‌కు ఇది కెప్టెన్‌గా వైదొలిగిన తర్వాత తొలి సిరీస్. కెప్టెన్సీ భారం లేకుండా బ్యాటింగ్ చేయడం ఎలా ఉందని ప్రశ్నించగా, బ్యాటర్‌గా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం, క్రీజులో గడిపే సమయాన్ని ఆస్వాదించడంపైనే దృష్టి సారిస్తున్నట్లు చెప్పింది. బ్యాటింగ్ సమయంలో ఇతర విషయాల గురించి ఆలోచించకుండా, మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడటమే తన లక్ష్యమని స్పష్టం చేసింది.