STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 26 October 2026, 11:06 pm Posted by : START TRINETHRAM

భారత్‌-చైనా సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తతలు.. గస్తీపై డ్రాగన్ కీలక ప్రకటన

భారత్‌-చైనా సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తతలు.. గస్తీపై డ్రాగన్ కీలక ప్రకటన
భారత్‌-చైనా సరిహద్దులో మరోసారి ఉద్రిక్తతలకు సంబంధించిన అంశం చర్చకు వచ్చింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో ఇరు దేశాల భద్రతా బలగాలు పలుచోట్ల ఎదురెదురుగా తారసపడుతున్నాయన్న వార్తల నేపథ్యంలో చైనా స్పందించింది. సరిహద్దు ప్రాంతాల్లో తమ సైనికులు సాధారణ గస్తీ విధులు నిర్వహిస్తున్నారని, భారత్‌తో కుదిరిన ఒప్పందాలు, పరస్పర అవగాహనలకు కట్టుబడి ఉన్నామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గ్వో జియాకున్ సోమవారం వెల్లడించారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రాదేశిక సార్వభౌమత్వం, స్థిరత్వాన్ని కాపాడేందుకు తమ దేశం క్రమం తప్పకుండా గస్తీ నిర్వహిస్తోందని తెలిపారు. ఇరు దేశాల మధ్య దౌత్య, సైనిక మార్గాల్లో సంప్రదింపులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతతను కొనసాగించేందుకు భారత్ కూడా పరస్పర అవగాహనలను గౌరవిస్తూ చైనాతో కలిసి పనిచేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్‌ డైరెక్టర్ జనరల్ శత్రుజీత్ సింగ్ కపూర్ ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దులో భారత, చైనా బలగాలు పలుచోట్ల ఎదురెదురుగా తారసపడిన ఘటనలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని, బలగాల సామర్థ్యాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీనిపై అక్టోబర్ 23న భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ, చైనా బలగాలు నిర్దేశిత గస్తీ విధానాలకు భిన్నంగా వ్యవహరించినప్పుడు సరిహద్దు పరిస్థితులు అప్పుడప్పుడు ఉద్రిక్తంగా మారుతున్నాయని పేర్కొన్నారు. ఇరు దేశాలు వివాదాలను పరిష్కరించేందుకు, అపార్థాలు తలెత్తకుండా నివారించేందుకు ఇప్పటికే ఉన్న దౌత్య, సైనిక సంప్రదింపుల వ్యవస్థలను వినియోగిస్తున్నాయని వివరించారు.

భారత్‌, చైనా మధ్య సరిహద్దు సమస్యకు సంబంధించి ఇరు దేశాల వైఖరులు భిన్నంగా ఉన్నాయి. వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ విధానాలపై స్పష్టత పెంచుకోవడం, కుదిరిన అవగాహనలను పాటించడం, సరిహద్దుల్లో శాంతిని కొనసాగించడం కీలకంగా మారాయి. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతత కొనసాగితేనే ఇరు దేశాల మధ్య విస్తృత సంబంధాలు మెరుగుపడతాయని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. తాజా పరిణామాలపై చైనా తన గస్తీ చర్యలు సాధారణమైనవేనని చెబుతుండగా, భారత్ మాత్రం నిర్దేశిత గస్తీ విధానాల నుంచి చైనా బలగాలు వైదొలగడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో దౌత్య, సైనిక స్థాయిలో జరిగే తదుపరి సంప్రదింపులు సరిహద్దు పరిస్థితులపై ప్రభావం చూపనున్నాయి.