STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 26 October 2026, 10:55 pm Posted by : START TRINETHRAM

తుపాను ముప్పుతో పలు రైళ్ల రద్దు.. ప్రయాణికులకు కీలక సూచన

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం రైల్వే డివిజన్ల పరిధిలో పలు మార్గాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. అక్టోబర్ 27, 28 తేదీల్లో 2 రోజుల పాటు పలు రైలు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రాజమహేంద్రవరం, విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, కాకినాడ పోర్ట్, విశాఖపట్నం, పార్వతీపురం తదితర ప్రాంతాల మధ్య నడిచే రైళ్లపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. దీంతో ఆయా మార్గాల్లో ప్రయాణించేందుకు ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైళ్ల రద్దుకు సంబంధించిన తాజా వివరాలను తెలుసుకున్న తర్వాతే ప్రయాణానికి సిద్ధం కావాలని అధికారులు సూచిస్తున్నారు.

అక్టోబర్ 27న విజయవాడ–నరసాపురం, నరసాపురం–రాజమండ్రి మార్గాలతో పాటు కాకినాడ పోర్ట్, విశాఖపట్నం, గుంటూరు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేశారు. అలాగే అక్టోబర్ 28న భీమవరం, నిడదవోలు, రేపల్లె, తెనాలి, మచిలీపట్నం వైపు వెళ్లే కొన్ని రైలు సర్వీసులు కూడా అందుబాటులో ఉండవని అధికారులు తెలిపారు. ఈ మార్పుల కారణంగా ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రయాణికులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రయాణానికి బయలుదేరే ముందు రైల్వే సమాచార కేంద్రాన్ని సంప్రదించి తమ రైలు నడుస్తుందా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైళ్ల రద్దుకు సంబంధించిన పూర్తి జాబితాను అధికారిక రైల్వే ప్రకటనల్లో పరిశీలించడం ద్వారా అనవసర ప్రయాణ ఇబ్బందులను నివారించుకోవచ్చు.