రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఓ సైనికుడి జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. తీవ్రంగా గాయపడి, కదల్లేని స్థితిలో యుద్ధభూమిలో చిక్కుకున్న ఉక్రెయిన్ సైనికుడు వ్లాసెంకో ప్రాణాలు కాపాడుకోవడానికి తన పాదాన్ని తానే నరుక్కోవాల్సి వచ్చింది. నెలల తరబడి నరకయాతన అనుభవించిన అతడిని చివరకు ఉక్రెయిన్ సైన్యం భారీ డ్రోన్ సాయంతో గాల్లోకి ఎత్తి సురక్షిత ప్రాంతానికి తరలించింది. సంప్రదాయ వాహనాలు చేరుకోలేని ప్రమాదకర ప్రాంతం నుంచి గాయపడిన సైనికుడిని డ్రోన్ ద్వారా బయటకు తీసుకురావడం యుద్ధంలో సాంకేతిక పరిజ్ఞానం ప్రాధాన్యాన్ని చాటిచెప్పింది.
గత ఏడాది మే నెలలో యుద్ధరంగంలోకి అడుగుపెట్టిన వ్లాసెంకో, బాస్కీ అనే మరో సైనికుడితో కలిసి చిన్న బంకర్లో విధులు నిర్వర్తించాడు. డ్రోన్ల ద్వారా అందించే ఆహారం, అవసరమైన వస్తువులతోనే వారు జీవనం సాగించారు. శరదృతువులో వారి స్థానంలో విధులు చేపట్టేందుకు వచ్చిన ఇద్దరు సైనికులు మార్గమధ్యంలో రష్యా దాడుల్లో మరణించారు. వారి మృతదేహాలను తీసుకురావడానికి వెళ్లిన మరో ఇద్దరు సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. దీంతో వ్లాసెంకో, బాస్కీ అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. దాదాపు పది నెలల పాటు కలిసి ఉన్న వారిద్దరికీ ఫిబ్రవరిలో మరో ప్రమాదం ఎదురైంది. బంకర్లోకి నీరు చేరడంతో సమీపంలోని శిథిలమైన పాఠశాలలో ఆశ్రయం పొందారు. కొద్ది రోజులకే ఆ భవనంపై రష్యా డ్రోన్ దాడి చేయడంతో బాస్కీ మరణించగా, వ్లాసెంకో తీవ్రంగా గాయపడ్డాడు.
దాడిలో వ్లాసెంకో ఎడమ పాదం పూర్తిగా దెబ్బతినడంతో పాటు కుడి కాలుకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఎముక బయటకు కనిపించేంతగా గాయపడటంతో కదలలేని స్థితికి చేరుకున్నాడు. పాఠశాలలోని బాయిలర్ గది కింద ఉన్న ప్రాంతంలో తలదాచుకున్న అతడికి వైద్యం అందలేదు. బయటకు వెళ్లే మార్గం కనిపించకపోవడంతో చివరకు ప్రాణాలు కాపాడుకోవాలనే ఆశతో తన పాదాన్ని కత్తితో నరుక్కుని, రక్తస్రావాన్ని ఆపేందుకు టోర్నికెట్ను ఉపయోగించాడు. ఖార్కివ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో రాయిటర్స్ వార్తా సంస్థతో మాట్లాడుతూ, తీవ్రంగా దెబ్బతిన్న పాదం నేలపై ఈడ్చుకుపోతూ, ఎముక బయటకు కనిపించడంతో దాన్ని తొలగించుకోవాల్సి వచ్చిందని తెలిపాడు. అప్పటికే తన అంత్యక్రియలు జరిగినట్లుగా భావించానని, బతికే ఆశ కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశాడు.
వ్లాసెంకోను రక్షించేందుకు ఉక్రెయిన్ సైన్యం పలుమార్లు ప్రయత్నించినప్పటికీ, రష్యా డ్రోన్ల దాడుల కారణంగా తరలింపు కష్టంగా మారింది. చక్రాలు లేదా గొలుసు పట్టీలతో నడిచే మానవరహిత భూతల వాహనాలను పంపించగా, అతడిని చేరుకునే ప్రయత్నంలో రెండు వాహనాలను రష్యా డ్రోన్లు ధ్వంసం చేశాయి. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించి, గుర్జుఫ్ డిఫెన్స్ సంస్థ అభివృద్ధి చేస్తున్న భారీ డ్రోన్‌ను ఉపయోగించాలని నిర్ణయించారు. ఆరు నిలువు రోటర్లు కలిగిన ఈ డ్రోన్ సుమారు 90 కిలోల బరువును మోస్తూ 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. సుదీర్ఘకాలం యుద్ధభూమిలో ఉండటంతో వ్లాసెంకో బరువు సుమారు 70 కిలోలకు తగ్గిపోయిందని అధికారులు అంచనా వేశారు.
అక్టోబర్‌లో అతడికి పంపిన ఆహార పార్సిల్లో ప్రత్యేక హార్నెస్, దాన్ని ఎలా ధరించాలో వివరించే వీడియోలున్న ఫోన్‌ను కూడా పంపించారు. భారీ డ్రోన్ అక్కడికి చేరుకున్నాక, వ్లాసెంకో తన శరీరానికి హార్నెస్‌ను బిగించుకుని డ్రోన్ కింద ఉన్న వించ్‌కు అనుసంధానించిన కారబైనర్కు తగిలించుకున్నాడు. అనంతరం డ్రోన్ అతడిని దాదాపు 70 మీటర్ల ఎత్తుకు ఎత్తి సురక్షిత ప్రాంతం వైపు తీసుకెళ్లింది. శత్రు డ్రోన్ల నుంచి రక్షణ కల్పించేందుకు మరో మూడు చిన్న డ్రోన్లు తోడుగా వెళ్లగా, ఉక్రెయిన్‌కు చెందిన నాలుగు ఎఫ్‌పీవీ డ్రోన్ బృందాలు, ఫిరంగి దళాలు, పెద్ద స్థిర రెక్కల డ్రోన్లు రష్యా డ్రోన్లు ఉన్న ప్రాంతాలపై దాడులు చేశాయి. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఆపరేషన్‌లో మార్గాన్ని సురక్షితం చేసిన సైన్యం, సుమారు 15 నిమిషాల ప్రయాణం తర్వాత వ్లాసెంకోను క్షేమంగా కిందకు దించింది. డ్రోన్‌లో ప్రయాణిస్తున్నప్పుడు కిందపడిపోతానేమోనని భయపడ్డానని, ముఖ్యంగా నీటిలో పడితే ఈత రాకపోవడంతో ప్రాణాపాయం ఏర్పడుతుందని ఆందోళన చెందానని అతడు తెలిపాడు. నిఘా, దాడులు, సరఫరాలకే పరిమితమైన డ్రోన్లను గాయపడిన సైనికుల రక్షణకు కూడా వినియోగించవచ్చని ఈ ఘటన చూపించింది. భారీ డ్రోన్ సాయంతో సైనికుడిని గాల్లో తరలించి రక్షించిన తొలి ఘటన ఇదేనని ఉక్రెయిన్ సైనికాధికారులు పేర్కొన్నారు.