STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 26 October 2026, 11:09 pm Posted by : START TRINETHRAM

దేశీయ వాహన రంగానికి కేంద్ర ప్రభుత్వం బిగ్ బూస్ట్

భారత రవాణా రంగంలో ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 100 శాతం ఇథనాల్‌తో నడిచే ఈ100 ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వాహనాల తయారీ, వినియోగానికి అనుమతించేలా కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు–1989లో సవరణలు చేసింది. వాహనాల తయారీ ప్రమాణాలు, ఉద్గార నిబంధనల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్పుల్లో భాగంగా సంబంధిత తేలికపాటి పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల బరువు పరిమితిని 3,000 కేజీల నుంచి 3,500 కేజీలకు పెంచింది. దీంతో వ్యక్తిగత, వాణిజ్య వాహనాల విభాగాల్లో మరింత వెసులుబాటు కలగనుంది.

అయితే ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న సాధారణ ఈ20 లేదా పెట్రోల్‌ కార్లలో నేరుగా ఈ85, ఈ100 ఇంధనాలను వినియోగించడం సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేశారు. అధిక శాతం ఇథనాల్‌ను తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించి, ధ్రువీకరణ పొందిన ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ ఇంజన్లు ఉన్న వాహనాల్లోనే వీటిని ఉపయోగించాలి. మారుతీ సుజుకి ఇప్పటికే ఈ20 నుంచి ఈ100 వరకు వివిధ ఇంధన మిశ్రమాలతో నడిచే వ్యాగన్‌ ఆర్‌ ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ నమూనాను అభివృద్ధి చేయగా, టయోటా, టాటా మోటార్స్‌, హ్యుండాయ్‌ సంస్థలు కూడా భారత మార్కెట్‌ కోసం ప్రత్యేక నమూనాల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నాయి.

పశ్చిమాసియాలో నెలకొంటున్న యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ ముడిచమురు ధరల్లో మార్పుల నేపథ్యంలో ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం ప్రభుత్వానికి ముఖ్యమైన లక్ష్యంగా మారింది. విదేశీ ముడిచమురు కొనుగోళ్లకు వెచ్చించే వ్యయాన్ని తగ్గించి, దేశ కరెంట్‌ అకౌంట్‌ లోటుపై ఒత్తిడిని నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం దోహదపడుతుందని భావిస్తున్నారు. ఈ85, ఈ100 ఇథనాల్‌తో పాటు బీ100 బయోడీజిల్‌, హైడ్రోజన్‌–సీఎన్‌జీ వంటి ఇంధనాల వినియోగానికి కూడా నిబంధనల మార్పులు మార్గం సుగమం చేయనున్నాయి.