STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 26 October 2026, 11:21 pm Posted by : START TRINETHRAM

మహారాష్ట్ర ఓటర్ల జాబితా సవరణ.. గడువు పొడిగింపునకు సుప్రీంకోర్టు నిరాకరణ

మహారాష్ట్రలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో క్లెయిమ్‌లు, అభ్యంతరాల దాఖలుకు గడువును తక్షణమే పొడిగించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ ప్రక్రియలో దాదాపు 33 శాతం మంది ఓటర్ల పేర్లను అక్రమంగా తొలగించారని ఆరోపిస్తూ అరుణ్ ఆనందగిరి దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది అరవింద్ దాతార్ వాదనలు వినిపించారు.

ముంబై, పూణే నగరాల్లో సుమారు 3,500 పునరాభివృద్ధి ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని, పాత నివాస సముదాయాల కూల్చివేత కారణంగా వేలాది మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు మారాల్సి వచ్చిందని న్యాయవాది కోర్టుకు వివరించారు. చిరునామా వివరాలు సరిపోలడం లేదనే కారణంతో వారి ఓటరు పేర్లు తొలగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఓటర్ల జాబితాలో పేర్లున్నవారి కోసం ప్రత్యేక ఫారమ్‌ ప్రవేశపెట్టాలని, కొత్త ఓటర్ల నమోదు కోసం ఉద్దేశించిన ఫారమ్‌-6ను పాత ఓటర్లతో నింపించడం చట్టవిరుద్ధమని వాదించారు. ఓటర్ల జాబితా ఖరారు ప్రక్రియపై స్టే విధించడంతో పాటు, అభ్యంతరాల దాఖలుకు గడువు పొడిగించాలని కోరారు.

అయితే, గడువును తక్షణమే పొడిగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి ధర్మాసనం అంగీకరించలేదు. అదే సమయంలో, పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. అర్హులైన ఓటర్లు పత్రాలు సమర్పించకుండా మిగిలిపోయినట్లు విచారణలో తేలితే గతంలో మాదిరిగానే గడువు పొడిగింపుపై ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రజల తరఫున వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చే విజిల్‌ బ్లోయర్‌గా పిటిషనర్‌ను అభివర్ణిస్తూ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది. ఈ కేసులో తదుపరి సమగ్ర విచారణను నవంబర్‌ 5వ తేదీకి వాయిదా వేసింది.