STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 26 October 2026, 11:56 pm Posted by : START TRINETHRAM

ఆ గ్రామంలో అడుగడుగునా హనుమాన్ ఆలయాలే.. 50కి పైగా గుడులతో ప్రత్యేక గుర్తింపు!

సాధారణంగా ఏ గ్రామంలోనైనా ఒకటి లేదా రెండు ఆంజనేయ స్వామి ఆలయాలు కనిపిస్తాయి. కానీ జగిత్యాల జిల్లాలోని ఓ గ్రామంలో మాత్రం అడుగుపెట్టిన ప్రతి వీధిలోనూ హనుమంతుడి ఆలయాలు దర్శనమిస్తాయి. గల్లీకో గుడి అన్నట్లుగా 50కి పైగా ఆంజనేయ స్వామి ఆలయాలు కొలువై ఉండటంతో ఈ గ్రామం ప్రత్యేక గుర్తింపు పొందింది. భక్తి, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్న ఈ ఊరు భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది.

జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి మండలం పరిధిలోని వెల్లూల గ్రామంలో సుమారు 4,000 మంది జనాభా నివసిస్తున్నారు. గ్రామంలో ఇన్ని ఆలయాలు ఏర్పడటానికి తరతరాలుగా కొనసాగుతున్న భక్తి సంప్రదాయమే కారణమని స్థానికులు చెబుతున్నారు. పూర్వం ఇక్కడ నివసించిన బ్రాహ్మణ కుటుంబాలు, ఇతర భక్తులు తమ కోరికలు నెరవేరిన సందర్భాల్లో హనుమంతుడికి కృతజ్ఞతగా ఒక్కో ఆలయాన్ని నిర్మించుకుంటూ వచ్చారని ప్రచారంలో ఉంది. అలా కాలక్రమేణా గ్రామమంతా ఆంజనేయ స్వామి ఆలయాలతో నిండిపోయింది.

వెల్లూల గ్రామంలోని ఆలయాల్లో అభయాంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి, గండి ఆంజనేయుడు, గణపతి ఆంజనేయుడు వంటి విభిన్న రూపాల్లో స్వామివారు దర్శనమిస్తారు. ప్రతి వీధి ప్రజలు తమ ప్రాంతంలోని ఆలయాల్లో నిత్యం పూజలు, దీపారాధనలు నిర్వహిస్తూ వాటిని స్వయంగా సంరక్షించుకుంటున్నారు. హనుమాన్ చిన్న జయంతి, పెద్ద జయంతి వేడుకల సమయంలో గ్రామమంతా కాషాయమయంగా మారుతుంది. పెద్ద సంఖ్యలో భక్తులు హనుమాన్ దీక్షలు చేపడుతూ ‘జై శ్రీరామ్.. జై హనుమాన్’ నినాదాలతో గ్రామాన్ని మారుమోగిస్తారు. నిత్యాన్నదానాలు, భజనలు, సంకీర్తనలతో వెల్లూల ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. హనుమంతుడిపై గ్రామస్థులకు ఉన్న అపారమైన భక్తికి ప్రతీకగా నిలుస్తున్న ఈ గ్రామం ప్రత్యేకత ఇప్పుడు పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది.