STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 9:41 am Posted by : DHEEKONDA SHIVAKRISHNA

Pm Surya Ghar: 300 యూనిట్ల వరకు పేదలందరికీ ఉచిత విద్యుత్..

Pm Surya Ghar: దేశంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు విద్యుత్ ఖర్చు భారం తగ్గించడంతో పాటు పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం పీఎం సూర్య ఘర్ మఫ్త్ బిజిలీ యోజన. 2024 ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇంటి పైకప్పుపై సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం భారీ సబ్సిడీ అందిస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలు ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రయోజనం పొందే అవకాశం ఉంది. విద్యుత్ బిల్లులను తగ్గించుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ఈ పథకం దోహదపడుతోంది. అంతేకాకుండా ఇంటి అవసరాలకు మించి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను నెట్ మీటరింగ్ విధానం ద్వారా విద్యుత్ పంపిణీ సంస్థలకు విక్రయించి అదనపు ఆదాయం కూడా పొందే అవకాశం కల్పించింది. ప్రభుత్వం అందించే సబ్సిడీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమ చేయడం ఈ పథకంలోని మరో ముఖ్యమైన అంశంగా నిలిచింది.

ఈ పథకం కింద సౌర విద్యుత్ వ్యవస్థ సామర్థ్యాన్ని బట్టి సబ్సిడీ కూడా మారుతుంది. 1 నుంచి 2 కిలోవాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే వారికి రూ.30,000 నుంచి రూ.60,000 వరకు సబ్సిడీ లభిస్తుంది. 2 నుంచి 3 కిలోవాట్ల సామర్థ్యం గల వ్యవస్థకు రూ.60,000 నుంచి రూ.78,000 వరకు సబ్సిడీ అందించబడుతుంది. 3 కిలోవాట్లు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యంతో సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నా గరిష్ఠంగా రూ.78,000 వరకు సబ్సిడీ మంజూరు చేస్తారు. దీంతో ప్రారంభ పెట్టుబడి భారం గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది.

ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. దరఖాస్తుదారు భారత పౌరుడై ఉండాలి. సొంత ఇల్లు కలిగి ఉండాలి. ఇంటికి చెల్లుబాటు అయ్యే విద్యుత్ కనెక్షన్ ఉండాలి. అలాగే గతంలో ఇదే ఉద్దేశంతో ప్రభుత్వం నుంచి సౌర విద్యుత్ వ్యవస్థకు సబ్సిడీ పొంది ఉండకూడదు. ఈ నిబంధనలను పూర్తి చేసిన వారు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా పరిగణించబడతారు.

దరఖాస్తు ప్రక్రియ కూడా పూర్తిగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి రూఫ్ టాప్ సోలార్ దరఖాస్తు ఎంపికను ఎంచుకోవాలి. అనంతరం అవసరమైన వివరాలను నమోదు చేసి విద్యుత్ వినియోగదారుడి సంఖ్య, మొబైల్ నంబర్‌తో ప్రవేశించాలి. తర్వాత దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి సమర్పించాలి. సంబంధిత విద్యుత్ పంపిణీ సంస్థ దరఖాస్తును పరిశీలించి ఆమోదించిన తర్వాత పోర్టల్‌లో నమోదైన విక్రేత ద్వారా ఇంటిపై సౌర ప్యానెల్లను ఏర్పాటు చేయించుకోవాలి. పనులు పూర్తయిన అనంతరం మళ్లీ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేయాలి. నెట్ మీటర్ ఏర్పాటు అనంతరం అధికారులు తనిఖీ నిర్వహించి కమిషనింగ్ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తారు. చివరిగా బ్యాంకు ఖాతా వివరాలు, రద్దు చేసిన చెక్కును పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తే, అన్ని వివరాలు సక్రమంగా ఉన్నట్లయితే సుమారు 30 రోజుల్లో సబ్సిడీ మొత్తం నేరుగా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.

ALSO READ: Actress Amrutha: మళ్లీ థియేటర్లలోకి రానున్న ఆరుగురు పతివ్రతలు?