STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 6:02 am Posted by : DHEEKONDA SHIVAKRISHNA

Gold Rivers: ఇక్కడ బంగారం ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ

Gold Rivers: బంగారం ధరలు రోజురోజుకూ కొత్త గరిష్ఠాలను నమోదు చేస్తుండటంతో సామాన్యుల నుంచి పెట్టుబడిదారుల వరకు అందరి దృష్టి పసిడిపైనే నిలుస్తోంది. ఇలాంటి సమయంలో ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో నదుల ఇసుకలోనే సహజసిద్ధంగా బంగారం లభిస్తుందనే విషయం ఆసక్తిని కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా బంగారం రేణువులు లభించే ప్రధాన నదులు మొత్తం 4 ఉన్నాయని చెబుతుంటారు. వాటిలో 2 భారతదేశంలో ఉండటం మరింత విశేషం. ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ప్రతిరోజూ నదిలోని ఇసుకను సేకరించి వడపోసి అందులోని సూక్ష్మ బంగారం రేణువులను వేరు చేసి విక్రయించడం ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. ఎలాంటి భారీ పెట్టుబడి లేకుండా కేవలం శ్రమతోనే విలువైన బంగారాన్ని సేకరించడం ఈ ప్రాంతాల ప్రత్యేకతగా నిలిచింది.

భారతదేశంలోని జార్ఖండ్ రాష్ట్రంలో ప్రవహించే సువర్ణరేఖ నది ఈ జాబితాలో ప్రముఖ స్థానం పొందింది. ఈ నది పేరుకు తగ్గట్టుగానే ఇక్కడి ఇసుకలో చిన్న చిన్న బంగారం రేణువులు కనిపిస్తుంటాయి. తెల్లవారుజామునే స్థానికులు నది తీరానికి చేరుకుని ఇసుకను సేకరించి ప్రత్యేక పద్ధతిలో వడపోస్తారు. ఆ ప్రక్రియలో లభించే బంగారం రేణువులను అమ్ముకుని కుటుంబాలను పోషిస్తున్నారు. అలాగే సువర్ణరేఖకు ఉపనదిగా ప్రవహించే కర్కరి నది ఇసుకలో కూడా బంగారం రేణువులు లభిస్తుంటాయి. అయితే ఈ రెండు నదుల్లోకి బంగారం ఏ ప్రాంతం నుంచి చేరుతోంది, దాని అసలు మూలం ఏమిటనే విషయం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు పూర్తిగా అంతుబట్టలేదు. ఇదే ఈ నదుల ప్రత్యేకతగా భావిస్తున్నారు.

భారతదేశం వెలుపల కూడా బంగారం లభించే నదులు ఉన్నాయి. కెనడాలోని కిలోడైక్ నది పరివాహక ప్రాంతం బంగారం నిల్వలకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలుగా బంగారం తవ్వకాలు కొనసాగుతుండగా, వేలాది మంది ప్రజలకు ఉపాధి కల్పిస్తోంది. అలాగే అమెరికాలోని మిస్సోరి నది పరిసర ప్రాంతాల్లో కూడా బంగారం కోసం అన్వేషణ కొనసాగుతోంది. ముఖ్యంగా 19వ శతాబ్దం మధ్యకాలంలో మోంటానా ప్రాంతంలోని వాగుల్లో బంగారం కనుగొనబడిన తర్వాత ఈ ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం కూడా నది ఇసుక తిన్నెల్లో బంగారం కోసం ప్రజలు వెతుకుతూ జీవనం సాగిస్తున్నారు. బంగారం ధరలు భారీగా ఉన్న ఈ రోజుల్లో ప్రకృతి ప్రసాదించిన ఈ నదులు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే ఈ ప్రాంతాల్లో బంగారం సేకరణకు సంబంధించి స్థానిక ప్రభుత్వాలు అమలు చేస్తున్న నిబంధనలు, అనుమతులు, పర్యావరణ పరిరక్షణ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

ALSO READ: Dating Apps: ముసలోడి అరాచకం.. 14 మంది మహిళలను రేప్ చేశాడు!