STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 6:07 am Posted by : DHEEKONDA SHIVAKRISHNA

Dating Apps: ముసలోడి అరాచకం.. 14 మంది మహిళలను రేప్ చేశాడు!

Dating Apps: 68 ఏళ్ల వయసులో ప్రశాంతంగా జీవితం గడపాల్సిన ఓ వ్యక్తి చేసిన దారుణాలు జర్మనీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆన్‌లైన్‌లో పరిచయాలు ఏర్పరుచుకునే మహిళలను లక్ష్యంగా చేసుకుని వరుసగా లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 68 ఏళ్ల వ్యక్తిపై జర్మనీ అధికారులు అధికారికంగా అభియోగాలు నమోదు చేశారు. డేటింగ్ యాప్‌ల ద్వారా మహిళలకు దగ్గరవుతూ నమ్మకం సంపాదించి, అనంతరం వారికి తెలియకుండా మత్తు మందులు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసి లైంగిక దాడులకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్రస్తుతం ఈ కేసు జర్మనీ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

దర్యాప్తు వివరాల ప్రకారం బెర్లిన్‌కు చెందిన నిందితుడు డేటింగ్ యాప్‌ల ద్వారా మహిళలతో పరిచయం పెంచుకుని, వారిని వ్యక్తిగతంగా కలిసేందుకు ఒప్పించేవాడని అధికారులు తెలిపారు. సమావేశం సందర్భంగా పానీయాల్లో నిద్రమాత్రలు, మత్తు కలిగించే పదార్థాలు కలిపి వారికి తెలియకుండా ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసేవాడని ఆరోపిస్తున్నారు. అనంతరం వారు అపస్మారక స్థితిలో ఉండగానే లైంగిక దాడులకు పాల్పడినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. బాధితులు స్పృహలో లేకపోవడం వల్ల తమపై ఏమి జరిగిందో కూడా చాలా మందికి తెలియకపోయిందని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. మరో కేసు విచారణలో లభించిన సమాచారం ఆధారంగా నిందితుడి ఇంటిపై పోలీసులు సోదాలు నిర్వహించగా, అక్కడ లభించిన డిజిటల్ పరికరాల్లో అనేక వీడియోలు గుర్తించినట్లు వెల్లడించారు. ఆ వీడియోలు దర్యాప్తులో కీలక ఆధారాలుగా మారడంతో నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

ప్రస్తుతం నిందితుడిపై 14 మంది మహిళలకు సంబంధించిన 22 లైంగిక దాడుల కేసుల్లో అభియోగాలు నమోదు చేసినట్లు జర్మనీ అధికారులు తెలిపారు. అయితే దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని, సుమారు 58 మంది మహిళలు ఈ కేసులో బాధితులై ఉండవచ్చని ప్రాసిక్యూటర్లు అనుమానిస్తున్నారు. డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తూ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఆన్‌లైన్‌లో పరిచయాలు ఏర్పరుచుకునే సమయంలో అపరిచితులపై అతి త్వరగా నమ్మకం పెట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వ్యక్తిగత సమావేశాలకు వెళ్లే ముందు కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు సమాచారం ఇవ్వడం, బహిరంగ ప్రదేశాలను ఎంచుకోవడం, పానీయాలను అపరిచితుల నుంచి స్వీకరించకుండా ఉండడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని భద్రతా నిపుణులు సూచిస్తున్నారు.

ALSO READ: Cheapest Electric Car: హాట్ కేకుల్లా అమ్ముడవుతోన్న బుజ్జి ఎలక్ట్రిక్ కార్