STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 02 June 2026, 9:11 am Posted by : DHEEKONDA SHIVAKRISHNA

తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. ఫ్రీ బస్సు ప్రయాణంలో భారీ మార్పు!

తెలంగాణలో మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్న మహిళలకు ప్రభుత్వం మరో సౌకర్యాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు ఆధార్ కార్డు చూపించి ప్రయాణిస్తున్న మహిళలు ఇకపై ప్రత్యేక స్మార్ట్ కార్డు ద్వారా ఉచిత టికెట్ పొందే అవకాశం కలగనుంది.

ప్రస్తుతం ఈ పథకానికి అర్హులైన మహిళల వివరాల సేకరణ పూర్తయినట్లు సమాచారం. త్వరలోనే వారికి ప్రత్యేక స్మార్ట్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఈ కార్డులు ఏటీఎం కార్డు తరహాలో ఉండనున్నాయి. కార్డులో మహిళల ఫోటో, ఆధార్‌కు సంబంధించిన ప్రాథమిక సమాచారం చిప్ రూపంలో అనుసంధానం చేయనున్నారు. దీంతో ప్రయాణ సమయంలో ఆధార్ కార్డు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.

ముందుగా ఒక డిపో పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్డులను అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. అక్కడ ఎదురయ్యే సాంకేతిక సమస్యలను పరిశీలించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు.

స్మార్ట్ కార్డుల తయారీకి అవసరమైన నిధులను ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసీకి విడుదల చేసినట్లు తెలుస్తోంది. దీంతో కార్డుల తయారీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.

2023 డిసెంబర్‌లో ప్రారంభమైన మహాలక్ష్మి పథకం మహిళల నుంచి విశేష స్పందన పొందింది. ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం అనేక మార్గాల్లో మహిళా ప్రయాణికులే అధికంగా కనిపిస్తున్నారు.