STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 10:20 pm Posted by : DHEEKONDA SHIVAKRISHNA

Kerala Schools: పిల్లల ఫ్యూచర్ కోసం లిప్ స్టిక్ నిషేధం

Kerala Schools: విద్యార్థుల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యం ఇస్తూ కేరళలోని పలు ప్రభుత్వ పాఠశాలలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. చిన్న వయసులోనే సౌందర్య సాధనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పాఠశాలలకు వచ్చే విద్యార్థులు పెన్నులు, పుస్తకాలతో పాటు లిప్‌స్టిక్‌లు, ఇతర అలంకరణ వస్తువులను తీసుకువస్తూ విరామ సమయంలో ఉపయోగిస్తున్నట్లు గుర్తించడంతో పలు పాఠశాలలు “నో మేకప్ పాలసీ” అమలు దిశగా అడుగులు వేస్తున్నాయి.

పిల్లలు చిన్న వయసులోనే సౌందర్య సాధనాలను ఎక్కువగా ఉపయోగించడం ఆరోగ్యపరంగా మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చర్మానికి నేరుగా తగిలే ఉత్పత్తుల్లో ఉండే కొన్ని రసాయనాలు దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు పాఠశాల ఆవరణలో లిప్‌స్టిక్‌లు, కాజల్‌, ఇతర అలంకరణ వస్తువులు ఉపయోగించకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

తిరువనంతపురంలోని ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రం నిర్వహించిన అధ్యయనంలో కొల్లాం, ఎర్నాకులం, కోజికోడ్ జిల్లాల్లో పిల్లల ఆరోగ్య పరిస్థితులపై పలు అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. అదే సమయంలో కొంతమంది విద్యార్థులు పాఠశాల విరామ సమయంలో మేకప్ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నట్లు ఉపాధ్యాయులు గమనించారు. దీంతో కొల్లాం జిల్లాలోని వయ్యనాడ్ ఉన్నత సెకండరీ పాఠశాలలో “నో మేకప్ పాలసీ” కార్యక్రమాన్ని కవి కురీపుళా శ్రీకుమార్ ప్రారంభించినట్లు వెల్లడైంది.

ఇప్పటికే కేరళలోని అనేక పాఠశాలలు విద్యార్థుల కోసం దుస్తుల నియమావళిని కఠినంగా అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో లిప్‌స్టిక్‌లు, కాజల్‌, ఇతర సౌందర్య ఉత్పత్తులను పాఠశాలకు తీసుకురావద్దని విద్యార్థులకు సూచనలు జారీ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి అవగాహన కల్పించే చర్యలు చేపడుతున్నారు.

ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణంగా కొన్ని సౌందర్య ఉత్పత్తుల్లో ఉండే హానికర రసాయనాలను నిపుణులు ప్రస్తావిస్తున్నారు. సీసం, పారాబెన్స్‌, పాదరసం వంటి పదార్థాలు అధికంగా ఉండే నాణ్యతలేని ఉత్పత్తులు ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు. ముఖ్యంగా 6 నుంచి 16 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉండటంతో ఇటువంటి ఉత్పత్తుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి చర్మ సమస్యలు, అలర్జీలు, హార్మోన్ల అసమతుల్యత వంటి ఇబ్బందులకు దారితీసే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.

గత ఏడాది కేరళలో నిర్వహించిన తనిఖీల్లో కొన్ని సౌందర్య ఉత్పత్తుల్లో అధిక స్థాయిలో పాదరసం ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం కొన్ని ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని విక్రయాలపై చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా పాఠశాలల సమీప ప్రాంతాల్లో విక్రయమవుతున్న ఉత్పత్తులపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం. విద్యార్థులు ఇటువంటి వస్తువులను ఉపయోగించకుండా తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పిల్లల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ “నో మేకప్ పాలసీ” అమలును మరింత విస్తరించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి.

ALSO READ: Interesting Facts: 1000కి ‘T’ కాకుండా ‘K’ని ఎందుకు వాడుతారు..?