STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 04 May 2026, 1:09 pm Posted by : DHEEKONDA SHIVAKRISHNA

TN Election Results: TVK విజయ్ సంచలనం.. 100కు పైగా స్థానాల్లో టీవీకే ఆధిక్యం

TN Election Results: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న వేళ రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. తాజా లెక్కల ప్రకారం తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక అన్నాడీఎంకే 70కు పైగా స్థానాల్లో, డీఎంకే 50కు పైగా స్థానాల్లో ఆధిక్యంతో వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచాయి. ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాల మధ్య విజయ్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడం దాదాపు ఖాయమనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో చెన్నైలోని విజయ్ నివాసం వద్ద భద్రతను భారీగా పెంచారు. ఫలితాల ట్రెండ్ బయటకు రావడంతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకునే అవకాశం ఉందని భావించిన అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. భారీగా పోలీస్ బలగాలను మోహరించి, జనసంచారాన్ని నియంత్రించేందుకు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. నివాసానికి వెళ్లే మార్గాల్లో ఇతర వాహనాల రాకపోకలను పరిమితం చేస్తూ ట్రాఫిక్‌ను మళ్లించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ భద్రతను కట్టుదిట్టం చేశారు.

విజయ్ నివాసం పరిసరాల్లో అభిమానుల సందడి క్రమంగా పెరుగుతోంది. పెద్ద ఎత్తున చేరుకుంటున్న మద్దతుదారులతో ఆ ప్రాంతం మొత్తం పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. రాజకీయంగా కీలక మలుపు తిరుగుతున్న ఈ సమయంలో ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుండగా, టీవీకే పార్టీ ప్రదర్శన రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మార్పులకు దారి తీసే సూచనలు కనిపిస్తున్నాయి.

ASLO READ: Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో మార్పులు.. ఇక నుంచి అమల్లోకి కొత్త విధానం