STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 04 May 2026, 2:11 pm Posted by : DHEEKONDA SHIVAKRISHNA

Social Media: చాటింగ్ పేరుతో చీటింగ్.. వీడియో కాలింగ్‌తో లూటింగ్

Social Media: జమానా వేగంగా మారిపోతున్న కొద్దీ మనుషుల ఆలోచనా విధానం, ప్రవర్తనలో కూడా గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. తక్షణ ఆనందాల కోసం పరుగులు పెడుతూ, తియ్యటి మాటలకు సులభంగా ఆకర్షితులవుతూ, తెలియని మాయ వలల్లో చిక్కుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికల ద్వారా పరిచయాలు పెరిగి, అవే తర్వాత మోసాలకు దారి తీస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మాటల మాధుర్యానికి మత్తెక్కి, అసలు వ్యక్తి ఎవరో కూడా తెలుసుకోకుండా నమ్మకం పెంచుకుని, చివరకు భారీగా డబ్బులు కోల్పోతున్న ఉదాహరణలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి.

కడప జిల్లాలోని బద్వేల్ మండలం గూడెం గ్రామానికి చెందిన అశోక్ అనే యువకుడి ఘటన ఇటీవలి కాలంలో తీవ్ర చర్చనీయాంశమైంది. మంచి ఉద్యోగం, స్థిరమైన ఆదాయం ఉన్న అతనికి 2023లో సోషల్ మీడియా వేదికలో పూజిత రెడ్డి అనే పేరుతో ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం రోజురోజుకు మరింత దగ్గరై, కాలక్రమేణా భావోద్వేగ అనుబంధంగా మారింది. అయితే ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. మూడు సంవత్సరాల పాటు మాట్లాడినా ఆ యువతిని ప్రత్యక్షంగా చూడలేదు. అయినప్పటికీ తియ్యటి మాటలతో నమ్మకం కలిగించిన ఆ వ్యక్తి, అవసరమంటూ డబ్బులు అడిగిన ప్రతిసారి అశోక్ వెనుకాడకుండా పంపించేవాడు. చివరకు అతను మొత్తం రూ.81,67,000 వరకు కోల్పోయిన తర్వాతే అసలు నిజం బయటపడింది. పూజిత రెడ్డి అనే పేరుతో ఉన్నది ఓ నకిలీ ఖాతా మాత్రమేనని, అది కూడా తనకు తెలిసిన వ్యక్తే సృష్టించిన మోసం అని తెలిసి షాక్‌కు గురయ్యాడు.

ఇలాంటి మోసాలు కేవలం యువతలోనే కాదు.. వృద్ధుల్లో కూడా పెరుగుతున్నాయి. అమీర్‌పేటకు చెందిన 81 ఏళ్ల వృద్ధుడికి ఒక యువతి పేరుతో ఫోన్ కాల్స్ రావడం ప్రారంభమైంది. ప్రతిరోజూ మధురంగా మాట్లాడి, వీడియో కాల్స్ ద్వారా దగ్గరయ్యింది. ఒంటరితనాన్ని ఆసరాగా తీసుకుని అతనిని నమ్మించే ప్రయత్నం చేసింది. అనంతరం ఆ వీడియో కాల్స్‌ను మార్పులు చేసి అతనిని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేశారు. చివరకు ఆ వృద్ధుడు రూ.7.11 లక్షలు కోల్పోయినట్లు బయటపడింది. ఈ ఘటనలు మానసికంగా బలహీనంగా ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మోసాలకు స్పష్టమైన ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.

ఇటీవల మరో రూపంలో కూడా ఇలాంటి వలలు విస్తరిస్తున్నాయి. కొంతమంది సోషల్ మీడియాలో తమ ప్రాచుర్యాన్ని ఉపయోగించుకుని ప్రత్యేక కంటెంట్ పేరుతో డబ్బులు వసూలు చేసే విధానాన్ని అమలు చేస్తున్నారు. కొంత భాగాన్ని ఉచితంగా చూపించి, మిగతా కంటెంట్ కోసం నెలకు రూ.399 వంటి చార్జీలు విధిస్తూ ఆకర్షిస్తున్నారు. అలాగే కొన్ని యాప్‌లు స్నేహం పేరుతో, ఒంటరితనం తగ్గిస్తామని చెప్పి గంటకు రూ.100, రూ.200 చొప్పున చెల్లించి మాట్లాడే విధంగా వినియోగదారులను ప్రోత్సహిస్తున్నాయి. మొదట సాధారణ సంభాషణగా ప్రారంభమై, తర్వాత భావోద్వేగ అనుబంధంగా మారి, చివరకు ఆర్థిక దోపిడీకి దారి తీస్తోంది.

ఇంకా కొన్ని వేదికల్లో పరిచయాలు పెంచుకుని చాటింగ్, వీడియో కాల్స్ ద్వారా వ్యక్తిగత వివరాలు సేకరించి, వాటిని ఉపయోగించి బెదిరింపులకు పాల్పడుతున్న సంఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఒకసారి ఈ వలలో పడితే బయటపడటం చాలా కష్టమవుతోంది. తమ గౌరవం దెబ్బతింటుందనే భయంతో బాధితులు బయటకు చెప్పుకోలేక మరింతగా నష్టపోతున్నారు. ప్రేమ పేరుతో, స్నేహం పేరుతో, వినోదం పేరుతో మొదలయ్యే ఈ పరిచయాలు చివరకు మోసం, బ్లాక్‌మెయిల్, ఆర్థిక నష్టాలకు దారి తీస్తున్నాయి.

సామాజిక కార్యకర్త శ్రీనివాస్ కందేటి అభిప్రాయం ప్రకారం.. ఇవి కేవలం మోసాలే కాకుండా సమాజంలో విలువలు తగ్గిపోతున్న సంకేతాలుగా చూడాలి. ఒకప్పుడు అవగాహన లేక మోసపోయేవారు, ఇప్పుడు చదువుకున్నవారు కూడా ఇలాంటి వలల్లో చిక్కుకుంటున్నారు. మరోవైపు వ్యాపారవేత్త ప్రత్యూష చెబుతున్నది ఏమిటంటే.. ఒంటరితనం, పని ఒత్తిడి, భావోద్వేగ లోపం వంటి అంశాలను గమనించి మోసగాళ్లు లక్ష్యంగా ఎంచుకుంటున్నారు. మొదట సానుభూతి చూపించి, తర్వాత నమ్మకం పెంచుకుని, చివరకు ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారు.

మొత్తానికి, సోషల్ మీడియా ద్వారా ఏర్పడే పరిచయాల్లో అప్రమత్తత చాలా అవసరం. తెలియని వ్యక్తులపై అతి నమ్మకం పెట్టుకోవడం, వ్యక్తిగత వివరాలు పంచుకోవడం, డబ్బులు పంపించడం వంటి చర్యలు తీవ్ర నష్టాలకు దారి తీస్తున్నాయి. ఏ పరిచయమైనా సరైన నిర్ధారణ తర్వాతే ముందుకు తీసుకెళ్లడం, అనుమానాస్పద పరిస్థితుల్లో వెంటనే దూరంగా ఉండడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి మోసాల నుంచి రక్షణ పొందవచ్చు.

ALSO READ: Supreme Court: ట్రాన్స్‌జెండర్ల హక్కులపై కేంద్రం, రాష్ట్రాలకు నోటీసులు