STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 09 May 2026, 6:40 am Posted by : Sandeep Kumar

Nizamabad: ఊర్లోకి రాకుండా హిజ్రాలపై నిషేధం

Nizamabad: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం బడా భీమ్‌గల్ గ్రామంలో హిజ్రాల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. గ్రామంలో జరిగే పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాల సమయంలో భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ పెద్దలు, స్థానికులు కలిసి కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలోకి హిజ్రాలు రాకుండా నిషేధం విధిస్తూ గ్రామ అభివృద్ధి కమిటీ తీర్మానం చేసినట్లు సమాచారం. ఈ నిర్ణయం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

గ్రామస్థుల వివరాల ప్రకారం.. ఇటీవల శుభకార్యాల సమయంలో కొందరు హిజ్రాలు ఇంటింటికీ వెళ్లి రూ.వేలల్లో డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేయడం, గొడవలకు దిగడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు ఈ వ్యవహారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని గ్రామస్థులు పేర్కొంటున్నారు. పలుమార్లు సర్దిచెప్పే ప్రయత్నాలు చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో గ్రామ అభివృద్ధి కమిటీ సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గ్రామ అభివృద్ధి కమిటీ తీసుకున్న తీర్మానం ప్రకారం, ఇకపై గ్రామంలోకి హిజ్రాలు వచ్చి బలవంతంగా డబ్బులు డిమాండ్ చేయడం అనుమతించబోమని స్పష్టం చేసినట్లు సమాచారం. గ్రామంలో శాంతిభద్రతలు, ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామ పెద్దలు చెబుతున్నారు. మరోవైపు ఈ వ్యవహారం సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారింది. కొందరు గ్రామస్థుల నిర్ణయానికి మద్దతు తెలుపుతుండగా, మరికొందరు మాత్రం ఇది వివాదాస్పద నిర్ణయమని అభిప్రాయపడుతున్నారు.

ALSO READ:PMMVY: ప్రతి మహిళా తెలుసుకోవాల్సిందే.. రెండో బిడ్డ ఆడపిల్ల పుడితే ఇక పండగే..