STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 10 May 2026, 11:08 am Posted by : kiran Kumar

Alien Mystery: గ్రహాంతరవాసులు నిజంగానే ఉన్నారా..?

Alien Mystery: దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి, అనుమానాలు, కుట్ర సిద్ధాంతాలకు కేంద్రబిందువుగా మారిన గ్రహాంతరవాసులు, గుర్తించబడని ఎగిరే వస్తువుల మిస్టరీపై అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నో ఏళ్లుగా పెంటగాన్ వద్ద అత్యంత రహస్యంగా ఉంచిన యూఎఫ్ఓ ఫైళ్లను ఇప్పుడు దశలవారీగా బహిర్గతం చేయడం ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ మొదలైనట్లు రక్షణ శాఖ వెల్లడించింది. పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు నిజాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ‘ప్రెసిడెన్షియల్ అన్‌సీలింగ్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఫర్ యూఏపీ ఎన్‌కౌంటర్స్’ పేరిట ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి, యూఏపీ, యూఎఫ్ఓలకు సంబంధించిన పాత రహస్య పత్రాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. దీనికోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించినట్లు సమాచారం.

గతంలో అమెరికా ప్రభుత్వాలు ఇలాంటి ఘటనలను పూర్తిగా ప్రజలకు తెలియనివ్వకుండా గోప్యంగా ఉంచాయని, కానీ ఇప్పుడు ప్రజలే ఈ ఫైళ్లను పరిశీలించి తమ అభిప్రాయాలను ఏర్పరుచుకునే అవకాశం కల్పిస్తున్నామని పెంటగాన్ పేర్కొంది. చాలా కాలంగా గ్రహాంతరవాసుల ఉనికిపై ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన చర్చ జరుగుతోంది. ఆకాశంలో కనిపించే వింత కాంతులు, గుర్తించలేని ఎగిరే వస్తువులు, సైనిక పైలట్లు రికార్డు చేసిన అసాధారణ దృశ్యాలు వంటి అంశాలు ఎన్నో సందేహాలకు దారితీశాయి. ఇప్పుడు విడుదలవుతున్న ఫైళ్లతో ఈ మిస్టరీపై మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఈ ఫైళ్ల సేకరణ, విశ్లేషణ ప్రక్రియలో అమెరికాలోని పలు ప్రముఖ ఏజెన్సీలు భాగస్వామ్యం అవుతున్నాయి. అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఆల్-డొమైన్ అనోమలీ రిజల్యూషన్ ఆఫీస్‌తో పాటు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ, నేషనల్ ఇంటెలిజెన్స్ విభాగాలు కూడా ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వివిధ కాలాల్లో నమోదైన యూఏపీ ఘటనలకు సంబంధించిన నివేదికలు, వీడియోలు, రాడార్ సమాచారాన్ని పరిశీలించి క్రమంగా ప్రజలకు విడుదల చేయనున్నారు. ముఖ్యంగా అమెరికా సైనిక విమానాలు ఎదుర్కొన్న అసాధారణ ఘటనలకు సంబంధించిన రికార్డులు ప్రజల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ఫిబ్రవరి 19న తన ట్రూత్ సోషల్ వేదికగా డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. గ్రహాంతరవాసులు, యూఏపీ, యూఎఫ్ఓలకు సంబంధించిన అన్ని రహస్యాలను బయటపెట్టాలని తాను యుద్ధ కార్యదర్శిని ఆదేశించినట్లు ట్రంప్ వెల్లడించారు. ప్రజల్లో ఉన్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇకపై ఈ అంశాలను రహస్యంగా ఉంచకూడదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే జేఎఫ్‌కే, మార్టిన్ లూథర్ కింగ్ హత్యలకు సంబంధించిన పాత రహస్య పత్రాలను విడుదల చేసిన ట్రంప్ ప్రభుత్వం, ఇప్పుడు విశ్వ రహస్యాలపై దృష్టి సారించడం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

అయితే విడుదలవుతున్న ప్రతి సమాచారం నిజంగానే గ్రహాంతరవాసులకు సంబంధించినదని భావించకూడదని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైనిక సాంకేతిక పరిజ్ఞానం, గగనతల వ్యవస్థలపై సరైన అవగాహన లేని వ్యక్తులు సాధారణ వైమానిక దృశ్యాలను కూడా యూఎఫ్ఓలుగా భావించే అవకాశం ఉందని చెబుతున్నారు. పెంటగాన్ గతంలో నిర్వహించిన సమీక్షల్లో ఇప్పటివరకు గ్రహాంతర జీవుల ఉనికిని నిర్ధారించే బలమైన ఆధారాలు ఏవీ లభించలేదని వెల్లడించింది. అయినప్పటికీ ఈ ఫైళ్ల విడుదలతో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న అనుమానాలకు కొంతమేర స్పష్టత వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. విశ్వంలో మనుషులు మాత్రమే ఉన్నారా? లేక మరెక్కడైనా జీవం ఉందా? అనే ప్రశ్నకు ఈ పత్రాలు సమాధానం ఇస్తాయేమోనని ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ALSO READ: Vijayashanti: సూపర్ స్టార్ కృష్ణ నన్ను సొంత కూతురిలా చూసుకున్నారు