STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 9:05 pm Posted by : Star Trinethram

Eega Mallesham: సమస్యలను ఎదుర్కొనే ధైర్యం కేవలం ‘విద్య’తోనే సాధ్యం

Eega Mallesham: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన విద్యా వారోత్సవాల ముగింపు సమావేశం ఆదివారం ఘనంగా జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ పోచయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఈగ మల్లేశం.. చదువు అనేది కేవలం పుస్తకాలకే పరిమితం కాదని, అది మనిషికి విజ్ఞానం, వినయం, సంస్కారం నేర్పించే గొప్ప శక్తి అని పేర్కొన్నారు. సమాజంలో ఎలా మెలగాలి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సొంత కాళ్లపై ఎలా నిలబడాలి అనే విషయాలను విద్య నేర్పుతుందని తెలిపారు. చదువు మనిషిని బాధ్యతాయుత పౌరుడిగా తీర్చిదిద్దుతుందని, జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని కల్పిస్తుందని అన్నారు.

కేవలం డిగ్రీలు సంపాదించడం మాత్రమే విద్య లక్ష్యం కాదని, తోటి మనుషులతో సామరస్యంగా జీవించడం, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా ఎదగడం కూడా చదువు ద్వారా సాధ్యమవుతుందని కొనియాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

అలాగే వర్ధన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఈగ మల్లేశం హామీ ఇచ్చారు. అనంతరం కళాశాల యాజమాన్యం ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో అన్నమనేని మోహన్ రావు, డాక్టర్ భరత్ కుమార్, కరిమిల్ల సంపత్ రావు, సంపత్ యాదవ్, పెద్దూరి రాజ్ కుమార్‌తో పాటు కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ALSO READ: MLA Nagaraju: ఖచ్చితమైన జనగణనతోనే అభివృద్ధికి బలమైన పునాది..