STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 10 April 2026, 12:44 pm Posted by : Star Trinethram

Telangana: ఆర్టీసీ ఉద్యోగులకు భారీగా డీఏ పెంపు!

Telangana: తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న కరువు భత్యం పెంపుపై స్పష్టత ఇస్తూ 2.1 శాతం పెంపును అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ పెరిగిన డీఏను 2026 జనవరి 1 నుండి అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. గత 3 నెలలకు సంబంధించిన బకాయిలను కూడా ప్రభుత్వం విడతల వారీగా చెల్లించనుంది. ప్రతి నెలకు సంబంధించిన బకాయిలను సప్లిమెంటరీ బిల్లుల ద్వారా చెల్లించే విధానాన్ని అమలు చేయనుంది. అయితే ఈ పెంపుతో ఆర్టీసీ సంస్థపై ప్రతి నెల రూ.2.82 కోట్ల అదనపు భారం పడనుంది. ఇదివరకు 2025 జూలైలో ప్రభుత్వం 2.1 శాతం డీఏ పెంచగా, అప్పుడు 48.6 శాతంగా ఉన్న డీఏను 50.7 శాతానికి పెంచింది. ప్రస్తుతం మరోసారి 2.1 శాతం పెరగడంతో డీఏ శాతం 52.8కి చేరింది. అలాగే 2024 మేలో ఆర్‌పీఎస్ 2017 అమలు చేసిన తరువాత ఉద్యోగులకు చెల్లించాల్సిన ఎలాంటి డీఏ బకాయిలు లేవని అధికారులు స్పష్టం చేశారు.

డీఏ పెంపు నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేశారు. డీఏ పెంపు నిర్ణయాన్ని స్వాగతించిన ఉద్యోగులు కూడా ప్రభుత్వానికి, మంత్రికి తమ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆర్టీసీకి సంబంధించిన పెండింగ్ పనులు, అభివృద్ధి కార్యక్రమాలపై వివిధ ప్రాంతాల ఆర్‌ఎంలతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి మిగిలి ఉన్న ఏకైక డీఏ బకాయిని కూడా ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. 2026 జనవరి నుండి 2.1 శాతం పెరిగిన డీఏ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. జనవరి నుండి ఇవ్వాల్సిన బకాయిలను వచ్చే 3 నెలల్లో విడతలుగా చెల్లిస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభం నుంచే ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం అనే మూడు ప్రధాన లక్ష్యాలతో పనిచేస్తోందని పేర్కొన్నారు.

ALSO READ: Science: వాటర్ ట్యాంకులు ఎత్తులోనే ఎందుకుంటాయో తెలిస్తే అవాక్కవుతారు!