STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 02 April 2026, 5:56 pm Posted by : Star Trinethram

Technology: అంధుల కోసం ప్రమాదాలను పసిగట్టే స్మార్ట్‌షూస్ ఆవిష్కరణ!

Technology: దృష్టి లోపం ఉన్నవారు లేదా పూర్తిగా అంధులు రోజువారీ జీవితంలో ఎదుర్కొనే సమస్యలు అనేకం. ఇంటి బయటకు వెళ్లడం నుంచి సాధారణంగా రోడ్డు మీద నడవడం వరకూ ప్రతి అడుగులోనూ ప్రమాదం ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఎదురుగా గుంతలున్నా, రాళ్లు ఉన్నా, వాహనాలు వస్తున్నా కనిపించకపోవడంతో అనేకసార్లు ప్రమాదాలకు గురవుతున్నారు. తమ పరిసరాల్లోనే సురక్షితంగా తిరగడానికి కూడా ఇబ్బందులు పడుతున్న ఈ వర్గానికి ఉపశమనం కలిగించేలా ఆస్ట్రియాకు చెందిన ఒక స్టార్టప్ సంస్థ సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. గ్రాజ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నిపుణులతో కలిసి ప్రత్యేకంగా అంధులు, దృష్టిలోపం ఉన్నవారిని దృష్టిలో ఉంచుకుని స్మార్ట్ షూస్‌ను అభివృద్ధి చేసింది. ఈ కొత్త సాంకేతికతతో రూపొందించిన షూస్ వారి నడకను మరింత సురక్షితంగా మార్చే లక్ష్యంతో రూపొందించబడ్డాయి.

ఈ స్మార్ట్ షూస్‌లో ప్రధానంగా వాటర్‌ప్రూఫ్ అల్ట్రాసోనిక్ సెన్సార్లు అమర్చబడి ఉంటాయి. ఇవి షూ ముందు భాగంలో ఉండి, ధరించిన వ్యక్తి ముందుభాగంలో సుమారు 4 మీటర్ల దూరం వరకు ఉన్న అడ్డంకులను గుర్తించగలవు. గోడలు, రాళ్లు, గుంతలు లేదా ఇతర అవరోధాలు ఉన్నప్పుడు వెంటనే స్పందించి వైబ్రేషన్ రూపంలో హెచ్చరిక ఇస్తాయి. అడ్డంకి ఎంత దగ్గరగా ఉంటే అంతగా వైబ్రేషన్ తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ఇది కారు పార్కింగ్ సెన్సార్ విధానాన్ని పోలి ఉంటుంది. ఈ విధంగా ముందుగానే ప్రమాదాన్ని గుర్తించగలిగే అవకాశం కలగడంతో ధరించిన వారు వెంటనే ఆగిపోవడం లేదా మార్గాన్ని మార్చుకోవడం ద్వారా ప్రమాదాన్ని తప్పించుకోగలుగుతారు.

ఇక ఈ షూస్‌లో అనేక ఆధునిక సాంకేతిక భాగాలు కూడా ఉన్నాయి. డిస్టెన్స్ సెన్సార్లు, ఫుట్ మూవ్‌మెంట్ సెన్సార్లు, వైబ్రేషన్ యూనిట్, ప్రకాశవంతమైన ఎల్ఈడీ లైట్లు, ప్రాసెసింగ్ యూనిట్ వంటి అంశాలు ఇందులో భాగంగా ఉంటాయి. ఈ పరికరాలు స్మార్ట్‌ఫోన్‌తో వైర్‌లెస్ కనెక్షన్ ద్వారా అనుసంధానమై పనిచేస్తాయి. వైబ్రేషన్ హెచ్చరికలతో పాటు ఆడియో సంకేతాల ద్వారా కూడా సమాచారం అందించవచ్చు. ప్రత్యేకంగా బోన్ కండక్షన్ హెడ్‌ఫోన్స్ ద్వారా చుట్టూ ఉన్న శబ్దాలు వినిపిస్తూ, అడ్డంకుల గురించి హెచ్చరికలు అందిస్తాయి. ఈ విధానం వినియోగదారులు పరిసర పరిస్థితులను అర్థం చేసుకునేలా సహాయపడుతుంది.

అదనంగా ఈ షూస్‌లో ఏర్పాటు చేసిన లైట్లు రాత్రి వేళల్లో లేదా తక్కువ కాంతి ఉన్న సమయంలో ఇతరులకు వీరిని గుర్తించేందుకు ఉపయోగపడతాయి. వాటర్ మరియు డస్ట్ నిరోధక కేసింగ్‌లో ఎలక్ట్రానిక్ భాగాలు, బ్యాటరీలను అమర్చడం వల్ల వర్షం, దుమ్ము వంటి పరిస్థితుల్లో కూడా అవి సురక్షితంగా పనిచేస్తాయి. మొత్తం మీద ఈ స్మార్ట్ షూస్ అంధులు, వృద్ధులు, దృష్టిలోపం ఉన్నవారికి స్వతంత్రంగా, సురక్షితంగా నడవడానికి ఎంతో సహాయపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెంది ప్రపంచవ్యాప్తంగా ఉపయోగపడే అవకాశముందని భావిస్తున్నారు.

ALSO READ: Ponguleti Srinivas Reddy: ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ప్రారంభించిన మంత్రి