STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 04 April 2026, 1:41 pm Posted by : Star Trinethram

IPL 2026: ముంబైతో ఢిల్లీ.. రాజస్థాన్‌తో గుజరాత్ ఢీ.. గెలుపెవరిదో?

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో ఉత్కంఠభరిత పోటీలు కొనసాగుతున్న వేళ, టోర్నీ ఉత్సాహం పీక్స్‌కు చేరుకుంది. ఇప్పటికే 7 మ్యాచ్‌లు ముగిసిన ఈ సీజన్‌లో నేడు అభిమానులకు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు ఒకే రోజు 2 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సీజన్‌లో తొలి డబుల్ హెడర్ కావడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. మధ్యాహ్నం మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనుండగా, సాయంత్రం పోరులో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది.

మధ్యాహ్నం 3:30 గంటలకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ రెండు జట్లు తమ తొలి మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి మంచి ఊపులో ఉన్నాయి. ముంబై జట్టులో రోహిత్ శర్మ అర్ధశతకంతో రాణించగా, ఢిల్లీ బౌలింగ్ విభాగం గత మ్యాచ్‌లో ప్రతాపం చూపించింది. అయితే ఢిల్లీ టాప్ ఆర్డర్ వరుసగా విఫలం కావడం ఆ జట్టుకు కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ఢిల్లీలో వర్షాలు కురిసినప్పటికీ, నేడు వాతావరణం అనుకూలంగా ఉండే అవకాశముందని సమాచారం. మ్యాచ్ ప్రారంభానికి ముందుగా మధ్యాహ్నం 3 గంటలకు టాస్ వేయనున్నారు.

ఇక సాయంత్రం 7:30 గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రెండో మ్యాచ్ ప్రారంభం కానుంది. సంజూ శాంసన్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్ గత మ్యాచ్‌లో చెన్నైపై ఘన విజయం సాధించి మంచి ఫామ్‌లో ఉంది. ముఖ్యంగా రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్ వంటి యువ ఆటగాళ్లు జట్టుకు బలంగా నిలుస్తున్నారు. మరోవైపు శుభ్‌మన్ గిల్ సారథ్యంలో గుజరాత్ టైటాన్స్ తన తొలి మ్యాచ్‌లో ఓటమి పాలవడంతో, ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని పట్టుదలతో ఉంది.

ఈ రెండు మ్యాచ్‌లను క్రికెట్ అభిమానులు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. డిజిటల్ వేదికలపై చూడాలనుకునే వారు జియో హాట్‌స్టార్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని ఆస్వాదించవచ్చు. మధ్యాహ్నం మ్యాచ్ 3:30 గంటలకు ప్రారంభమవుతుండగా, సాయంత్రం మ్యాచ్ 7:30 గంటలకు మొదలవుతుంది. ప్రతి మ్యాచ్‌కు 30 నిమిషాల ముందు టాస్ నిర్వహిస్తారు.

పిచ్ పరిస్థితుల విషయానికి వస్తే.. ఢిల్లీ వేదిక సాధారణంగా బ్యాటర్లకు అనుకూలంగా ఉండి భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఇక అహ్మదాబాద్ పిచ్ పేసర్లకు కొంత మద్దతు ఇస్తూనే, బ్యాటర్లకు కూడా పరుగుల అవకాశాలను కల్పిస్తుంది. సాయంత్రం మ్యాచ్ సమయంలో మంచు ప్రభావం ఉండే అవకాశం ఉండటంతో టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో తొలి డబుల్ హెడర్ కావడంతో స్టేడియాలు అభిమానులతో కిక్కిరిసిపోతాయని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

ALSO READ: Traditional Beliefs: మీ చేత్తో ఈ 5 వస్తువులు ఇతరులకు ఇవ్వకండి.. అప్పుల పాలవుతారు?