STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 19 April 2026, 10:37 pm Posted by : kiran Kumar

Mohammed Ayub: కేంద్రంపై కాంగ్రెస్ నేత విమర్శలు

Mohammed Ayub: వరంగల్ జిల్లాలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై మరోసారి మాటల యుద్ధం చెలరేగింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆదివారం విలేకరుల సమావేశంలో మహిళా రిజర్వేషన్ అంశాన్ని డిలిమిటేషన్ ప్రక్రియతో అనుసంధానించి ముందుకు తీసుకురావాలని కేంద్రం ప్రయత్నించిందని, ఆ వ్యూహాన్ని తిప్పికొట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆయన పేర్కొన్నారు. బిల్లు ఆమోదం పొందకపోవడంతో ఇప్పుడు ప్రతిపక్షాలపై అసత్య ప్రచారాలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. మహిళల హక్కుల విషయంలో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు కలపకుండా, మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రత్యేకంగా తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా పాకిస్తాన్‌తో పోల్చి వ్యాఖ్యలు చేయడం బీజేపీకి తగదని మండిపడ్డారు. మహిళల సాధికారతలో కాంగ్రెస్ పార్టీ పాత్రను గుర్తుచేస్తూ, గతంలోనే మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని స్పష్టం చేశారు. దేశ చరిత్రలో మహిళలకు అత్యున్నత పదవులు కల్పించడంలో కాంగ్రెస్ ముందంజలో నిలిచిందని పేర్కొన్నారు. ఇందిరా గాంధీ ప్రధానిగా పనిచేయడం, సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వ్యవహరించడం, మీరా కుమార్ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. మహిళల అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని, కానీ బీజేపీ మాటల్లో మాత్రమే మహిళా సాధికారతను ప్రస్తావిస్తుందని, ఆచరణలో మాత్రం కనిపించడం లేదని విమర్శించారు.

బీజేపీ నిజంగా మహిళల పక్షపాతి అయితే దేశానికి ఒక మహిళను ప్రధానిగా నియమించగలదా, లేకపోతే కనీసం పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా ఒక మహిళను ఎంపిక చేయగలదా అని ఆయన ప్రశ్నించారు. డిలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని, అందుకే ప్రతిపక్షాలు ఒక్కటిగా నిలబడి ఆ అంశాన్ని వ్యతిరేకించాయని చెప్పారు. ఈ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకం కాదని స్పష్టం చేసిన అయూబ్, డిలిమిటేషన్ ప్రక్రియ వల్ల కొన్ని రాష్ట్రాలకు నష్టం కలగబోతుందనే ఆందోళనతోనే ఈ అంశాన్ని వ్యతిరేకిస్తున్నామని వివరించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్‌లో ఈ అంశంపై గట్టిగా గళమెత్తారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిజంగా మహిళల పట్ల నిబద్ధత కలిగి ఉంటే, ఆలస్యం చేయకుండా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రత్యేకంగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని ఆయన సవాల్ విసిరారు.

ALSO READ: Kavitha: కొత్త పార్టీ గుబులు.. తెలంగాణ జాగృతిలోకి మాజీ ఎమ్మెల్యేల క్యూ..?