Narayanpet: ప్రపంచ నాటక రంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నాటక కళను ప్రజల్లో మరింత విస్తృతంగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో నారాయణపేట జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీజీఏ థియేటర్ అసోసియేషన్ మరియు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మద్దూర్ మున్సిపాలిటీ పరిధిలోని రెనివట్ల గ్రామంలో ఐదు రోజుల పాటు ప్రసిద్ధి చెందిన శ్రీశ్రీశ్రీ మునిరంగా స్వామి నాటకం ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు నాటకానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమం ఈ నెల 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు వరుసగా ఐదు రోజుల పాటు రాత్రి వేళల్లో కొనసాగనుంది. గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయ నాటక కళను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామని బీజీఏ థియేటర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీకాంత్ కాడం పేర్కొన్నారు. అలాగే ఈ నాటక ప్రదర్శనలు రాత్రంతా కొనసాగుతూ ప్రేక్షకులకు వినోదంతో పాటు సాంప్రదాయ కళలపై అవగాహన కల్పిస్తాయని నాటక ఉపాధ్యాయుడు కాడం బుగ్గప్ప తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నాటక రంగానికి మద్దతు పెంచి, యువతను ఈ కళ వైపు ఆకర్షించేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమని నిర్వాహకులు పేర్కొన్నారు.
ALSO READ: Mystery Places: భూమిపై గురుత్వాకర్షణ శక్తి ఉండే ప్రదేశాలు ఇవే..