STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 12:47 pm Posted by : Sanga Ravi kumar

Gas Safety Tips: గ్యాస్ లీక్ అయిందని కంగారుపడకండి.. ముందు ఈ పని చేయండి!

Gas Safety Tips: ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ లీకేజీ అనే విషయం వినగానే చాలా మందిలో భయం కలగడం సహజం. అలాంటి సమయంలో ఏం చేయాలో అర్థం కాక గందరగోళానికి గురవుతుంటారు. అయితే నిపుణుల సూచనల ప్రకారం సరైన జాగ్రత్తలు పాటిస్తే పెద్ద ప్రమాదాలను సులభంగా నివారించవచ్చని చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు, లీకేజీ ఘటనలు తరచుగా చోటుచేసుకుంటుండటంతో ప్రతి కుటుంబం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. గ్యాస్‌ లీకేజీ వల్ల చిన్న నిర్లక్ష్యం కూడా భారీ ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు, అత్యవసర చర్యలు తెలుసుకోవడం చాలా కీలకం.

గ్యాస్‌ సిలిండర్‌ను ఇంటికి తీసుకునే సమయంలోనే జాగ్రత్తలు మొదలవ్వాలి. డెలివరీ సమయంలో సిలిండర్‌పై కంపెనీ సీల్‌ సరిగా ఉందో లేదో తప్పనిసరిగా తనిఖీ చేయాలి. సిలిండర్‌ను అమర్చిన తర్వాత లీకేజీ ఉందో లేదో పరీక్షించడం అత్యంత ముఖ్యమైన చర్య. దీని కోసం సబ్బు నీటిని ఉపయోగించి కనెక్షన్ వద్ద రాస్తే బుడగలు వస్తే లీక్ ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అగ్గిపెట్టె లేదా మంటతో పరీక్షించకూడదు. అలాగే గ్యాస్‌ పైపు తప్పనిసరిగా ఐఎస్ఐ గుర్తు కలిగి ఉండాలి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పైపును మార్చడం సురక్షిత చర్యగా భావించాలి.

వంట చేసే సమయంలో కూడా కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. వంటగదిలో గాలి సరైన రీతిలో వెళ్లేలా కిటికీలు తెరిచి ఉంచడం అవసరం. దీని వల్ల ఏదైనా లీకేజీ జరిగినా గ్యాస్ బయటకు వెళ్లిపోతుంది. స్టౌవ్‌పై పాలు లేదా ఇతర పదార్థాలు పెట్టి మరచిపోవడం చాలా ప్రమాదకరం. అవి పొంగిపొర్లి మంట ఆరిపోతే గ్యాస్‌ బయటకు రావడం ప్రారంభమవుతుంది. అలాగే వంట సమయంలో సింథటిక్‌ లేదా నైలాన్‌ దుస్తులు ధరించడం మానుకుని, కాటన్‌ దుస్తులు ధరించడం సురక్షితమని నిపుణులు సూచిస్తున్నారు.

రాత్రి సమయంలో లేదా ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. నిద్రకు వెళ్లే ముందు లేదా ఇంటిని వదిలి బయటకు వెళ్లేటప్పుడు గ్యాస్‌ సిలిండర్‌ రెగ్యులేటర్‌ను తప్పనిసరిగా ఆఫ్‌ చేయాలి. ఖాళీ సిలిండర్లను కూడా నిర్లక్ష్యం చేయకుండా వాటికి క్యాప్‌ పెట్టి గాలి సరిగ్గా ఆడే ప్రదేశంలో నిల్వ చేయాలి. సిలిండర్‌ను ఎప్పుడూ పడుకోబెట్టకుండా నిలువుగా ఉంచడం తప్పనిసరి.

ఏదైనా కారణంతో గ్యాస్‌ లీకేజీ జరిగితే మొదటగా శాంతంగా ఉండటం చాలా ముఖ్యం. వెంటనే సిలిండర్‌ రెగ్యులేటర్‌ను ఆఫ్‌ చేయాలి. ఆ సమయంలో ఇంట్లో ఎలక్ట్రిక్‌ స్విచ్‌లు ఆన్‌ చేయడం లేదా ఆఫ్‌ చేయడం పూర్తిగా నివారించాలి, ఎందుకంటే చిన్న స్పార్క్‌ కూడా పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది. వెంటనే ఇంటి తలుపులు, కిటికీలు తెరిచి గాలి సరిగ్గా వెళ్లేలా చూడాలి. పరిస్థితి తీవ్రమైతే ఆలస్యం చేయకుండా గ్యాస్‌ ఏజెన్సీకి లేదా 1906 హెల్ప్‌లైన్‌ నంబర్‌కు సమాచారం ఇవ్వాలి. సరైన అవగాహన, సమయానికి తీసుకునే చర్యలు గ్యాస్‌ లీకేజీ ప్రమాదాలను పూర్తిగా నివారించగలవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ALSO READ: Secret: శుభకార్యాల్లో కొబ్బరికాయ ఎందుకు కొడతారో తెలుసా?