STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 4:22 pm Posted by : Star Trinethram

Fish: ఆరోగ్యానికి పచ్చి చేపలు మంచివా?.. ఎండు చేపలు మంచివా?

Fish: నాన్ వెజ్ ఆహారం ఇష్టపడే వారికి చేపలు ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంటాయి. చాలా మంది తాజా చేపలను ఎక్కువగా తీసుకుంటున్నప్పటికీ, ఎండు చేపలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. వాస్తవానికి మార్కెట్‌లో పచ్చి చేపలు, ఎండు చేపలు రెండూ లభ్యమవుతాయి. అయితే పచ్చి చేపలతో పోలిస్తే ఎండు చేపలలో పోషకాల సాంద్రత ఎక్కువగా ఉండడం విశేషం. రుచితో పాటు శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో ఎండు చేపలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి అధిక ప్రోటీన్, కాల్షియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలకు మంచి వనరులు కావడంతో ఎముకల బలం పెరగడం, గుండె ఆరోగ్యం మెరుగుపడడం, మెదడు పనితీరు చురుకుగా ఉండడం వంటి ప్రయోజనాలు లభిస్తాయి. అదనంగా రోగనిరోధక శక్తిని పెంచడంలో, జలుబు, దగ్గు, జ్వర లక్షణాలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. తక్కువ ధరలో లభించడమే కాకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండే లక్షణం కూడా ఎండు చేపల ప్రత్యేకతగా చెప్పవచ్చు.

సర్వేల ప్రకారం భారత్‌లో చేపలు తినే వారిలో దాదాపు 90 శాతం మంది పచ్చి చేపలను ఎంచుకుంటుండగా, కేవలం 10 శాతం మంది మాత్రమే ఎండు చేపలను ఉపయోగిస్తున్నారు. అయితే పచ్చి చేపలతో పోలిస్తే ఎండు చేపలలో పోషకాల పరిమాణం గణనీయంగా అధికంగా ఉంటుంది. సాధారణంగా పచ్చి చేపలలో 18 నుంచి 20 శాతం వరకు ప్రోటీన్ ఉండగా, ఎండు చేపలలో ఇది 60 శాతం వరకు ఉంటుంది. దీనికి ప్రధాన కారణం నీటి శాతం. పచ్చి చేపలలో 60 నుంచి 80 శాతం వరకు నీరు ఉండటం వల్ల అవి త్వరగా పాడవుతాయి. కానీ ఎండు చేపలలో నీరు దాదాపుగా లేకపోవడం వల్ల సూక్ష్మక్రిములు చేరే అవకాశం తగ్గి, ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవచ్చు.

ఎండు చేపలను గది ఉష్ణోగ్రత వద్ద సుమారు 6 నెలల వరకు నిల్వ ఉంచినా పాడవకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నిల్వ చేసినా రుచిలో పెద్దగా మార్పు ఉండదు. నీరు పూర్తిగా ఎండిపోవడం వల్ల ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటాయి. మరోవైపు పచ్చి చేపలను సాధారణంగా 7 రోజుల వరకు మాత్రమే ఫ్రిజ్‌లో నిల్వ ఉంచవచ్చు. అయితే ఎండు చేపలకు ఉండే ప్రత్యేక వాసన కారణంగా చాలా మంది వాటిని ఇంట్లో నిల్వ చేయడానికి ఆసక్తి చూపించరు.

ఎండు చేపలను ఎక్కువకాలం నిల్వ ఉంచేందుకు వాటిపై అధికంగా ఉప్పు రాయడం సాధారణ ప్రక్రియ. అయితే ఈ ఉప్పు కారణంగా రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండు చేపలలోని ఉప్పు శాతాన్ని తగ్గించేందుకు వండే ముందు వాటిని నీటిలో బాగా కడగడం లేదా సుమారు 40 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద అరగంట పాటు నానబెట్టడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే పచ్చి చేపలను 65 నుంచి 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉడికిస్తే సూక్ష్మక్రిములు పూర్తిగా నశిస్తాయి. అదేవిధంగా మైనస్ 4 డిగ్రీల వద్ద నిల్వ ఉంచినప్పటికీ సూక్ష్మక్రిములు చనిపోతాయి.

పోషకాల పరంగా చూస్తే ఎండు చేపలు మరింత సమృద్ధిగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఒక కిలో పచ్చి చేపల ద్వారా సుమారు 20 గ్రాముల ప్రోటీన్ లభిస్తే, అదే పరిమాణంలోని ఎండు చేపలలో దాదాపు 600 గ్రాముల ప్రోటీన్ లభిస్తుందని అంచనాలు సూచిస్తున్నాయి. దీనికి కారణం ఎండు చేపలలో నీటి శాతం లేకపోవడమే. అయితే ఆరోగ్యపరంగా చూస్తే పచ్చి చేపలు, ఎండు చేపలు రెండూ సమానంగా ఉపయోగకరమైనవే. ఈ రెండింటిలోనూ ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు డి, ఏ, కే, బీ12 లభిస్తాయి. అలాగే జింక్, మెగ్నీషియం, కాల్షియం, అయోడిన్, రాగి, సెలీనియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా అందుబాటులో ఉంటాయి. సరైన విధంగా నిల్వ ఉంచి వాడితే ఈ పోషకాలు తగ్గవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం వైద్యుల సలహా తీసుకుని చేపలను ఆహారంలో చేర్చుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

ALSO READ: Bank Holidays: ఇంతకీ బ్యాంకులకు రేపు సెలవు ఉన్నట్లా? లేనట్లా?