STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 03 March 2026, 3:00 pm Posted by : Star Trinethram

Family Tragedy: నువ్వు 9 నెలలు మోసి కన్న పిల్లలే కదమ్మా!

Family Tragedy: యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. బీబీనగర్ మండలం గొల్లగూడెం గ్రామంలో ఓ వివాహిత తన ఇద్దరు చిన్నారులను హతమార్చి, అనంతరం తాను కూడా ప్రాణాలు తీసుకోవడం హృదయాలను కలచివేసింది. సంతోషంగా ఉండాల్సిన ఒక కుటుంబం క్షణాల్లో శోకసంద్రంలో మునిగిపోవడంతో గ్రామం మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి.

గొల్లగూడెం గ్రామానికి చెందిన ఐశ్వర్య అనే మహిళ తన ఇద్దరు చిన్నారులను హతమార్చి అనంతరం బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలంలో లభ్యమైన ఒక లేఖను పోలీసులు స్వాధీనం చేసుకోగా, ఆ లేఖలో ఆమె తన మరణానికి గల కారణాలను వివరించినట్టు తెలుస్తోంది. కుటుంబంలో ఎదురైన మానసిక వేధింపులు తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె ఆ లేఖలో పేర్కొన్నట్టు సమాచారం.

తన అత్తింటి కుటుంబ సభ్యుల ప్రవర్తన తనకు తీవ్ర మానసిక వేదన కలిగించిందని ఐశ్వర్య లేఖలో ఆరోపించినట్టు తెలుస్తోంది. భర్త తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించాడని, కనీస అవసరాలు కూడా తీర్చలేదని ఆవేదన వ్యక్తం చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. భర్త తన తల్లిదండ్రులు, సోదరి మాటలు విని తనను వేధించేవాడని కూడా ఆమె ఆ లేఖలో ప్రస్తావించినట్టు సమాచారం. తన జీవితం మొత్తం అవమానాలు, బాధలతో నిండిపోయిందని, ఇక తట్టుకోలేని స్థితికి చేరుకున్నానని ఆమె రాసినట్టు తెలిసింది.

తన పిల్లలను ఉన్నతంగా చదివించాలని, మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఎన్నో కలలు కన్నానని, అయితే తాను లేకపోతే వారిని చూసుకునే వారు ఎవరూ ఉండరనే ఆందోళన తనను మరింత కలవరపరిచిందని లేఖలో పేర్కొన్నట్టు సమాచారం. ఆ ఆందోళనతోనే వారిని కూడా తనతో పాటు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నానని ఆమె రాసినట్టు తెలుస్తోంది. చివరగా తన మరణానికి కారణమైన భర్త, అత్త, మామపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారు జీవితాంతం శిక్ష అనుభవించాలని కోరుకున్నట్టు లేఖలో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. చిన్నారుల అమాయక మరణం అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. కుటుంబ వివాదాలు ఇంతటి ఘోర పరిణామాలకు దారి తీసిన తీరు స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతదేహాలను పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. లేఖ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు వెల్లడించారు. కుటుంబ సభ్యులను విచారిస్తూ అసలు ఘటనకు దారి తీసిన పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ALSO READ: Suspense Drama: ఫ్యూజులు ఎగిరే ట్విస్టులు.. మస్త్ మసాలా.. క్లైమాక్స్ అయితే ఊహాతీతం భయ్యా