STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 15 March 2026, 11:47 am Posted by : Star Trinethram

కుక్క పిల్లను ఒడిలో పడుకోబెట్టుకుని అమ్మ ప్రేమను పంచిన వానరం!

ఆధునిక సమాజంలో బంధాలు, అనుబంధాలు క్రమంగా బలహీనపడుతున్నాయని తరచూ వినిపిస్తోంది. కన్నవారు, తోబుట్టువులు, రక్తసంబంధికుల మధ్య కూడా స్వార్థం, ఈర్ష్య, ద్వేషాలు పెరిగి మనుషులు ఒకరితో ఒకరు దూరమవుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మూగజీవాలు మాత్రం ప్రేమ, ఆప్యాయతలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. జాతి భేదాన్ని కూడా పట్టించుకోకుండా ఇతర జీవాల పట్ల చూపుతున్న అనురాగం ఎంతో మందిని ఆలోచింపజేస్తోంది. మానవత్వం మసకబారుతున్న సమాజానికి మూగజీవాలు ఒక మంచి సందేశాన్ని అందిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇలాంటి అరుదైన సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో చోటుచేసుకుంది. నగరంలోని హనుమాన్ నగర్ ప్రాంతంలో ఒక వానరం దారి తప్పి ఒంటరిగా తిరుగుతున్న కుక్కపిల్లను అక్కున చేర్చుకుని ఆశ్చర్యపరిచింది. ఎండ తీవ్రతతో అలసిపోయిన ఆ కుక్కపిల్ల నెమ్మదిగా చెట్టు నీడ వైపు వచ్చి కూర్చుంది. తల్లి నుండి దూరమైన ఆ చిన్న ప్రాణి దిక్కుతోచక అల్లాడుతున్న దృశ్యాన్ని చెట్టుపై ఉన్న వానరం గమనించింది. వెంటనే చెట్టు మీద నుంచి కిందికి దిగివచ్చి ఆ కుక్కపిల్లను తన ఒడిలోకి తీసుకుంది.

కొన్ని రోజుల పసికూన అయిన ఆ కుక్కపిల్లను వానరం తల్లిలా ఆదరించింది. ప్రేమగా నిమురుతూ, ఒడిలో పెట్టుకుని లాలించింది. వానరం చూపిన ఆప్యాయతకు కుక్కపిల్ల కూడా స్పందిస్తూ తల్లిలా భావించి ప్రశాంతంగా దాని ఒడిలోనే సేదతీరింది. ఈ అపూర్వ దృశ్యం అక్కడి ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. జాతి వైరాన్ని మరిచి ఒక జీవి మరొక జీవిని అక్కున చేర్చుకున్న ఈ సంఘటనను చూసిన వారు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

మనుషుల మధ్య పెరుగుతున్న క్రూరత్వం, స్వార్థం మధ్య మూగజీవాలు చూపించిన ఈ ప్రేమ అందరినీ ఆలోచింపజేస్తోందని స్థానికులు పేర్కొన్నారు. మనుషులు కూడా ఇలాంటి ప్రేమ, దయ, అనురాగాలను అలవరచుకుంటే సమాజం మరింత మంచిగా మారుతుందని వారు అభిప్రాయపడ్డారు. మూగజీవాలు చూపించిన ఈ ఆప్యాయత నిజమైన మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తుందని ఈ సంఘటన చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు.

ALSO READ: Viral News: వధువు వింత కండిషన్.. అతిగా నగలు వేసుకుంటే పెళ్లిలోకి నో ఎంట్రీ!