STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 13 March 2026, 8:58 pm Posted by : Star Trinethram

Wardhannapet BC United Forum: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహం

Wardhannapet BC United Forum: వర్థన్నపేటలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రోత్సాహం కల్పించేందుకు బీసీ ఐక్యవేదిక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించింది. వర్థన్నపేట జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు శుక్రవారం ఓ ప్రటకన ద్వారా తెలిపారు. పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు కూడా ఉన్నత విద్యలో ముందుకు రావాలని లక్ష్యంగా పెట్టుకుంటారని తెలిపారు. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ సబ్బండ కులాలకు చెందిన విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని బీసీ ఐక్యవేదిక సభ్యులు పేర్కొన్నారు.

పదవ తరగతి వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన తొలి 10 మంది విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను పై చదువుల దిశగా ప్రోత్సహించేందుకు “బీసీ ఆణిముత్యాలు” పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందించడం ద్వారా మరింత ఉత్సాహం కల్పించాలని నిర్వాహకులు భావిస్తున్నారు.

ఇప్పటివరకు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రత్యేక నగదు బహుమతులు ఇవ్వడం ప్రధానంగా ప్రైవేటు పాఠశాలల్లో మాత్రమే కనిపించేదని, అయితే 2026-27 విద్యాసంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా ఇదే తరహా ప్రోత్సాహకాలు అందించేందుకు వర్థన్నపేట బీసీ ఐక్యవేదిక ముందుకొచ్చిందని వారు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచి వారు కూడా ఉన్నత స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని బీసీ ఐక్యవేదిక సభ్యులు ఆకాంక్షించారు. విద్యార్థులు తమ భవిష్యత్తును నిర్మించుకునే దిశగా ముందుకు సాగాలని కోరుతూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో విద్యకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను సాధించాలనే దృఢసంకల్పంతో చదువుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థికి రూ.10000 నగదు బహుమతి, షీల్డ్ అందజేయనున్నారు. రెండవ ర్యాంక్ సాధించిన విద్యార్థికి రూ.8000 నగదు బహుమతి, షీల్డ్ ఇవ్వనున్నారు. మూడవ స్థానం నుంచి 10వ స్థానం వరకు ఉన్న ప్రతి విద్యార్థికి రూ.5000 చొప్పున నగదు బహుమతి అందజేయనున్నట్లు బీసీ ఐక్యవేదిక ప్రకటించింది. ఈ బహుమతులను వర్థన్నపేట బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అధికారికంగా అందజేయనున్నట్లు తెలిపారు.

ALSO READ: Muhammad Ayub: ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన వరంగల్ డీసీసీ అధ్యక్షులు