STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 17 February 2026, 6:00 pm Posted by : Star Trinethram

Torrur Elections: కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు (VIDEO)

Torrur Elections: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తొర్రూర్ మున్సిపల్ ఎన్నికల పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుండగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ చర్యపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రస్తుత ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆరోపిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.

తొర్రూర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన వేళ, మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల పోలీస్ స్టేషన్‌కు ఆయనను తరలిస్తుండగా భారీగా చేరుకున్న బిఆర్ఎస్ శ్రేణులు పోలీస్ వాహనాన్ని అడ్డగించాయి. నినాదాలతో ఆగ్రహం వ్యక్తం చేసిన కార్యకర్తలను పోలీసులు వెంటనే చెదరగొట్టి, భద్రతా నిబంధనల మధ్య ఆయనను స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అనంతరం మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి దయాకర్ రావు.. అక్రమ అరెస్టుల ద్వారా ప్రభుత్వం ప్రతిపక్ష స్వరాన్ని అణచివేయాలని చూస్తోందని విమర్శించారు. వరంగల్ ఎంపీ కావ్యకు వరంగల్ కమిషనరేట్ పరిధిలోనే ఓటు హక్కు ఉందని, అదే విషయాన్ని కమిషనర్‌కు లేఖ ద్వారా తెలియజేసినప్పటికీ తొర్రూర్‌లో ఓటు హక్కు వినియోగం ఎలా సాధ్యమవుతుందో స్పష్టత ఇవ్వాలని ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లేకుండా వ్యవహరిస్తున్నారని, టాస్ ప్రక్రియలో కూడా తమను మోసం చేశారని ఆరోపించారు.

తొర్రూర్‌లో తమకు ఇల్లు, కార్యాలయం ఉన్నాయని, స్థానికంగా ప్రజల మద్దతు తమకే ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు మెజార్టీ ఇచ్చినా అధికార యంత్రాంగం ద్వారా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబ సభ్యులను సైతం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లడం దురదృష్టకరమని, ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో కొనసాగాలా వద్దా అనే సందేహం కలుగుతోందని కంటతడి పెట్టారు.

మున్సిపల్ ఎన్నికలతో పాటు సర్పంచ్, ఎంపిటిసిల ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు శ్రమించామని, కార్యకర్తల కష్టాలు చూస్తుంటే వారికి సమాధానం చెప్పలేకపోతున్నానని భావోద్వేగానికి లోనయ్యారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంలో ఆయన వెంట మానుకోట మాజీ ఎంపీ కవిత, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్, నర్సింహులపేట మండల పార్టీ అధ్యక్షుడు మైదం దేవేందర్, మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు గూగులోత్ రవి నాయక్, కొమ్ములవంచ మాజీ సర్పంచ్ దాసరోజు వెంకటేశ్వర్లు, దంతాలపల్లి నాయకులు ఓలాద్రి మల్లారెడ్డి, కుంభం సుధీర్ రెడ్డి, బండి రమేష్, లగ్పతి, బిక్షం రెడ్డి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

ALSO READ: Colour Chicks: రంగురంగుల కోడిపిల్లలు చనిపోకుండా ఎలా పెంచాలో తెలుసా?