STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 06 February 2026, 2:16 pm Posted by : Star Trinethram

మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని హీటెక్కిస్తున్న గులాబీ నేతలు

స్టార్ త్రినేత్రం, వర్ధన్నపేట: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం రోజురోజుకు ఉత్కంఠభరితంగా మారుతోంది. పోలింగ్‌ తేదీ సమీపిస్తుండటంతో ప్రచారం పీక్స్‌కు చేరుకుంది. ప్రచారానికి ఇంకా కేవలం నాలుగు రోజులే మిగిలి ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే దిశగా వ్యూహాలను మరింత పదునుపెట్టాయి. ఒక్కో వార్డులో పోటీ తీవ్రంగా ఉండటంతో అభ్యర్థులు ఇంటింటా తిరుగుతూ తమ బలాన్ని చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో 9వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సింగరబోయిన రమా రాజశేఖర్ శుక్రవారం ఉదయం నుంచే ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి కాలనీలు, గల్లీలు తిరుగుతూ ఓటర్లను నేరుగా కలుస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా గులాబీ జెండానే ఎగురుతుందని, బీఆర్ఎస్‌కే ప్రజల మద్దతు కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని, ఇది నాయకుల మాట కాదని ప్రజల నోట వినిపిస్తున్న స్వరం అని ఆయన గట్టిగా చెబుతున్నారు. ప్రజల్లో బీఆర్ఎస్‌కు ఉన్న విశ్వాసమే తమ విజయానికి కారణమవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో ఈసారి కేవలం పార్టీ శ్రేణుల మద్దతుతోనే సరిపోదని, తటస్థ ఓటర్లే ఫలితాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారని నేతలు భావిస్తున్నారు. అందుకే వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూసుకుంటూనే, ఇప్పటివరకు నిర్ణయం తీసుకోని ఓటర్లను తమవైపు తిప్పుకునేలా ప్రచార వ్యూహాలను రచిస్తున్నారు. అభివృద్ధి అంశాలే ప్రధాన అజెండాగా ప్రజల ముందుకు వెళ్తూ, గత పాలనలో చేపట్టిన పనులను గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

అభివృద్ధిని విస్మరించి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికల ద్వారా ప్రజలే సరైన తీర్పు ఇవ్వాలని, ఈ ఎన్నికలు రేవంత్ రెడ్డి సర్కారుకు కళ్లు తెరిచేలా ఉండాలని ఓటర్లను చైతన్యవంతులను చేస్తున్నారు. స్థానిక సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, పట్టణ అభివృద్ధి కోసం బీఆర్ఎస్‌కే ఓటు వేయాలని కోరుతున్నారు.

ALSO READ: Gas cylinder: మీ ఇంట్లో వంట గ్యాస్ త్వరగా ఐపోతుందా? అయితే ఇలా చేయండి..