STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 28 February 2026, 12:55 pm Posted by : Star Trinethram

Bhadrachalam: పరీక్ష రాస్తుండగా విద్యార్థినికి గర్భస్రావం.. చివరికి బాత్‌రూమ్‌లో!..

Bhadrachalam: ఐదు నెలల గర్భంతో ఉన్న ఓ మైనర్ బాలిక ఇంటర్ పరీక్ష రాయడానికి హాజరై పరీక్ష హాల్లోనే తీవ్ర రక్తస్రావానికి గురై స్పృహ తప్పిపడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. సాధారణంగా ప్రశాంతంగా సాగాల్సిన పరీక్షా కేంద్రం ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితులకు వేదికైంది. విద్యార్థులు పరీక్ష రాస్తుండగా చోటుచేసుకున్న ఈ సంఘటన అక్కడున్న సిబ్బందిని, అధికారులను దిగ్భ్రాంతికి గురి చేసింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఒక పరీక్షా కేంద్రంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ప్రభుత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బాలికల వసతి గృహంలో ఉంటూ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ బాలిక తనకు కేటాయించిన కేంద్రానికి పరీక్ష రాయడానికి వచ్చింది. పరీక్ష ప్రారంభమైన సుమారు 1 గంటలోనే ఆమె అస్వస్థతకు గురై రక్తస్రావంతో బాధపడుతున్నట్లు ఇన్విజిలేటర్లు గమనించారు.

తక్షణమే పరీక్షా కేంద్రంలో అందుబాటులో ఉన్న సహాయక నర్సులకు సమాచారం అందించారు. బాలికను ప్రశ్నించగా ఆమె గర్భవతి అన్న విషయం బయటపడింది. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో వెంటనే ఆమె చదువుతున్న కళాశాల నిర్వాహకులకు, వసతి గృహ వార్డెన్‌కు సమాచారం అందించారు. వార్డెన్ పరీక్షా కేంద్రానికి చేరుకునేలోపే బాలిక స్పృహ కోల్పోయి కిందపడిపోయింది.

అత్యవసరంగా ఆమెను పాల్వంచలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల ప్రాథమిక పరిశీలనలో బాలిక 5 నెలల గర్భవతిగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. పరీక్షకు హాజరయ్యే ముందు గర్భస్రావానికి సంబంధించిన మాత్రలు వినియోగించి ఉండవచ్చని, దాంతోనే తీవ్ర రక్తస్రావం జరిగి స్పృహ కోల్పోయిందని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాలిక గర్భం దాల్చిన విధానం, దీనికి కారకులెవరు అనే అంశాలపై దర్యాప్తు ప్రారంభించారు. వసతి గృహంలో ఉంటున్న మైనర్ బాలిక గర్భవతి కావడం ఎలా జరిగిందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇంతకాలం హాస్టల్ నిర్వాహకులకు విషయం తెలియకపోవడమేంటి అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బాధిత బాలికకు న్యాయం జరిగేలా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ALSO READ: DNA Tests: ఆరుగురు పిల్లలకూ తాను తండ్రి కాదని తెలిసి.. (VIRAL VIDEO)