STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 12 February 2026, 11:08 pm Posted by : Star Trinethram

Accreditation: ఏ మీడియాకు ఎన్ని కార్డులో తెలుసా?

Accreditation: రాష్ట్రంలోని అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. గురువారం సచివాలయంలో సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ ప్రియాంక, ముఖ్యమంత్రి సీపీఆర్‌వో మల్సూర్‌లతో కలిసి అక్రిడిటేషన్ ప్రక్రియపై మంత్రి సమీక్ష నిర్వహించారు.

జీవోల్లో సవరణలు- పారదర్శక విధానం..

అక్రిడిటేషన్ కార్డుల జారీలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం తొలుత జీవో 252ను జారీ చేసిందని మంత్రి తెలిపారు. అనంతరం జర్నలిస్టు సంఘాల సూచనల మేరకు సవరణలు చేసి జీవో 103ను అమల్లోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా విభాగాలకు కలిపి మొత్తం 44,706 అక్రిడిటేషన్ కార్డులు మంజూరు కానున్నాయి.

గతంలో కేవలం 23 వేల కార్డులు మాత్రమే ఉండగా, ఇప్పుడు అదనంగా 21 వేల మందికి పైగా జర్నలిస్టులకు ప్రయోజనం కలగనుందని మంత్రి వివరించారు.

విభాగాల వారీగా కార్డుల కేటాయింపు..

ప్రింట్ మీడియా

2.50 లక్షల పైగా సర్క్యులేషన్ ఉన్న 8 పత్రికలు- 6,256 కార్డులు

75,000 నుంచి 2.50 లక్షల సర్క్యులేషన్ ఉన్న 24 పత్రికలు- 17,784 కార్డులు

15,001 నుంచి 75,000 మధ్య సర్క్యులేషన్ ఉన్న పత్రికలు- 15,051 కార్డులు

15 వేలలోపు సర్క్యులేషన్ ఉన్న పత్రికలు- 226 కార్డులు

ఎలక్ట్రానిక్ మీడియా

21 శాటిలైట్ ఛానళ్లు- 4,431 కార్డులు

జాతీయ ఛానళ్లు- 32 కార్డులు

లోకల్ కేబుల్ ఛానళ్లు- 200 కార్డులు

ఇతర విభాగాలు

పీరియాడికల్స్- 624 కార్డులు

న్యూస్ ఏజెన్సీలు- 68 కార్డులు

డిజిటల్ మీడియా- 10 కార్డులు

స్థాయిల వారీగా కేటాయింపు

మొత్తం కార్డులలో రాష్ట్ర, జిల్లా స్థాయిలకు 16,056 కార్డులు కేటాయించగా, నియోజకవర్గ, మండల స్థాయిలకు 28,650 కార్డులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

అక్రిడిటేషన్ కార్డుల జారీ ఒక నిరంతర ప్రక్రియ అని, మీడియా ప్రతినిధుల గౌరవం, భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన జర్నలిస్టుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.

ALSO READ: T20 World Cup: నమీబియాపై భారత్ ఘన విజయం