STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 27 February 2026, 12:38 pm Posted by : Sanga Ravi kumar

Devotional: పుణ్య క్షేత్రాన్ని దర్శించుకున్నాక నేరుగా ఇంటికే వెళ్లలా?

Devotional: ఏదైనా పుణ్యక్షేత్రం దర్శించిన తర్వాత నేరుగా ఇంటికే వెళ్లాలి, మధ్యలో మరెవరి ఇళ్లకు వెళ్లకూడదు అనే నియమం శాస్త్రాలలో స్పష్టంగా పేర్కొనబడలేదు. ఇది కాలక్రమేణా ఏర్పడిన ఒక ఆచార పరంపర మాత్రమే. పెద్దలు చెప్పిన ఈ ఆచారం వెనుక ఉన్న భావం మాత్రం ఎంతో ఆధ్యాత్మికమైనది.

క్షేత్రంలో స్వామి దర్శనం ద్వారా కలిగే దైవానుభూతి, మనసుకు వచ్చే ప్రశాంతత, భక్తి భావం ఇవన్నీ ఆ క్షణాల్లో అత్యంత పవిత్రంగా ఉంటాయి. ఆ అనుభూతిని అలాగే మనసులో దాచుకుని, ఇంటికి చేరుకుని దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ సమారాధన చేయడం శ్రేయస్కరం అని భావించారు. ఆ తర్వాత ఆ తీర్థప్రసాదం, అనుభవాన్ని కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో పంచుకోవాలని సూచించారు.

మధ్యలో ఇతరుల ఇళ్లకు వెళ్లినప్పుడు సహజంగానే ప్రాపంచిక విషయాలు, రోజువారీ చర్చలు, సామాన్య సంభాషణలు మొదలవుతాయి. దాంతో తీర్థయాత్ర ద్వారా వచ్చిన ఆధ్యాత్మిక భావం కొంతమేర తగ్గిపోతుందనే అభిప్రాయం ఉంది. అందుకే “క్షేత్రానుభూతి నిలకడగా ఉండాలంటే నేరుగా ఇంటికే చేరాలి” అనే ఆచారం ఏర్పడింది.

ఇది కచ్చితమైన ఆజ్ఞ కాదు, భక్తి భావాన్ని పరిరక్షించేందుకు సూచించిన సాంప్రదాయ పద్ధతి మాత్రమే. ముఖ్యంగా భక్తి, కృతజ్ఞత, ఆత్మపరిశీలన ఇవే తీర్థయాత్రల అసలు ఫలితం. అవి నిలిచేలా చూసుకోవడమే ఈ ఆచారానికి మూల భావం.

ALSO READ: పీరియడ్స్ టైంలో మహిళలు ఈ తప్పులు అసలు చేయకండి