STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 02 February 2026, 11:18 pm Posted by : Star Trinethram

Home Remedies: మీ ఇంట్లో ఈగలు, దోమలు, బొద్దింకలు బాగా ఉన్నాయా..? ఏం చింతించకండి.. ఒక్క కర్పూరం చాలు!

Home Remedies: ఇంట్లో ఈగలు, దోమలు, బొద్దింకల బెడదతో చాలామంది నిత్యం ఇబ్బంది పడుతుంటారు. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకున్నా ఈ కీటకాలు ఎక్కడో ఒక మూల నుంచి లోపలికి చొరబడుతూనే ఉంటాయి. ముఖ్యంగా వంటగది, బాత్‌రూమ్, ఇంటి మూలలు, తలుపులు, కిటికీల దగ్గర ఇవి ఎక్కువగా కనిపిస్తూ అసహనం కలిగిస్తాయి. ఇవి కేవలం చిరాకు మాత్రమే కాదు.. ఇంటి వాతావరణాన్ని కలుషితం చేయడమే కాకుండా ఆరోగ్య సమస్యలకు కూడా కారణమవుతాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలామంది మార్కెట్లో లభించే రసాయన స్ప్రేలు పురుగుమందులు వాడుతుంటారు. కానీ అవి చిన్న పిల్లలు, పెంపుడు జంతువులకు హానికరంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అయితే రసాయనాల జోలికి వెళ్లకుండా సహజమైన మార్గంలో ఈగలు, దోమలు, బొద్దింకలను ఇంటి దరిదాపుల్లోకి రానివ్వకుండా చేసే సులభమైన చిట్కా ఉందని నిపుణులు చెబుతున్నారు. అదే ‘కర్పూరం’. సాధారణంగా పూజల్లో ఉపయోగించే కర్పూరం ఇంట్లో కీటకాలను తరిమికొట్టడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుందని వారు వివరించారు. కర్పూరంలో ఉండే ప్రత్యేకమైన వాసన ఈగలు, దోమలు, బొద్దింకలకు అస్సలు నచ్చదు. అందుకే అవి ఆ ప్రాంతానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తాయని చెబుతున్నారు.

ప్రత్యేకంగా వంటగదిలో బొద్దింకల సమస్య ఎక్కువగా ఉంటుంది. సింక్ దగ్గర పైపుల వద్ద కౌంటర్ల మూలల్లో ఇవి దాక్కుంటూ ఆహారంపై పడే ప్రమాదం ఉంటుంది. ఇలా జరిగితే ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతుంది. దీనికి పరిష్కారంగా కర్పూరం ముక్కలను టిష్యూ పేపర్ లేదా పలుచని గుడ్డలో చుట్టి వంటగదిలో సింక్ దగ్గర ఉంచితే సరిపోతుంది. కర్పూరం నుంచి వచ్చే వాసన వల్ల బొద్దింకలతో పాటు ఇతర కీటకాలు కూడా ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

ఇక ఈగలు, దోమల బెడద ఎక్కువగా ఉన్న ఇళ్లలో కర్పూరం పొగ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కర్పూరాన్ని వెలిగించి దోమలు ఎక్కువగా కనిపించే ప్రదేశంలో కొద్దిసేపు ఉంచితే వాటి సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అంటున్నారు. కర్పూరం వాసన కారణంగా దోమలు, ఈగలు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి. అదనంగా ఇంటి అంతటా మంచి సువాసన కూడా వ్యాపిస్తుంది.

కర్పూరాన్ని ఉపయోగించే మరికొన్ని పద్ధతులు కూడా ఉన్నాయి. రెండు కర్పూరం ముక్కలను నీటిలో వేసి కరిగించి ఆ నీటిని స్ప్రే బాటిల్‌లో పోసుకుని ఇంటి మూలలు పడకగది తలుపులు కిటికీల దగ్గర స్ప్రే చేస్తే దోమలు దూరంగా ఉంటాయి. అలాగే దీపంలో వేప నూనె పోసి అందులో కర్పూరాన్ని వెలిగించి తలుపులు, కిటికీల దగ్గర ఉంచితే ఈగలు దోమలు ఇంట్లోకి రావడం తగ్గుతుంది.

ఇంటిని తుడిచే నీటిలో కర్పూరం పొడిని కలిపి ఉపయోగించినా మంచి ఫలితం కనిపిస్తుంది. వంటగది కౌంటర్లు నేలలు తుడిచేటప్పుడు ఇలా చేస్తే కీటకాలు దూరంగా ఉండటమే కాకుండా ఇంటి మొత్తం సువాసనతో నిండిపోతుంది. రసాయనాలు అవసరం లేకుండా సహజమైన మార్గంలో ఈగలు, దోమలు, బొద్దింకల సమస్యకు చెక్ పెట్టాలనుకునే వారు ఈ కర్పూరం చిట్కాను తప్పకుండా ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ALSO READ: Arrest: ఏసీబీ వలలో మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్