STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 28 January 2026, 1:39 pm Posted by : Star Trinethram

తెలంగాణ విపత్తు నిర్వహణపై ప్రభుత్వ దృష్టి

దేశానికి ఆదర్శంగా వ్యవస్థ తీర్చిదిద్దుతామన్న మంత్రి

సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష

ఆధునిక సాంకేతికత వినియోగానికి ప్రణాళిక

మండల స్థాయి వరకు వాతావరణ కేంద్రాలు

: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

స్టార్ త్రినేతం, హైదరాబాద్: తెలంగాణలో విపత్తు నిర్వహణ వ్యవస్థను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. విపత్తులు సంభవించినప్పుడు స్పందించడమే కాకుండా, ముందే వాటిని అంచనా వేసి నివారణ చర్యలు చేపట్టే స్థాయికి వ్యవస్థను తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఈ దిశగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

సచివాలయంలో ఫైర్ సర్వీసెస్, SDRF, హైడ్రా విపత్తు నిర్వహణ విభాగాల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి కీలక సూచనలు చేశారు. విపత్తు నిర్వహణలో భాగంగా అత్యంత ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చి, సమయానికి ప్రాణరక్షణ చర్యలు చేపట్టేలా వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పారు. విపత్తుల తీవ్రతను తగ్గించడంలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు.

విపత్తు నిర్వహణ సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ప్రత్యేక ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా, సమర్థంగా పనిచేసేలా సిబ్బందిని సిద్ధం చేయడమే ఈ శిక్షణ కేంద్రం ప్రధాన లక్ష్యమని తెలిపారు. శిక్షణతో పాటు ఆధునిక పరికరాల వినియోగంపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ మార్పులను క్షుణ్ణంగా గమనించేందుకు మండల స్థాయి వరకు అత్యాధునిక వాతావరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దీనివల్ల వర్షాలు, వరదలు, తుపానులు వంటి ప్రకృతి వైపరీత్యాలపై ముందస్తు హెచ్చరికలు జారీ చేయడానికి వీలవుతుందన్నారు. ప్రజలకు సమయానికి సమాచారం అందితే నష్టం తగ్గించే అవకాశం ఉంటుందని చెప్పారు.

విపత్తుల సమయంలో సహాయక చర్యలు మరింత వేగంగా చేపట్టేందుకు భారీ బరువులు మోయగల డ్రోన్లు, హైస్పీడ్ బోట్లు కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా వరదలు, ముంపు ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పరిస్థితిని అంచనా వేసి తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఎత్తయిన భవనాల్లో అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనేందుకు అవసరమైన ఆధునిక పరికరాలను త్వరలోనే సమకూరుస్తామని చెప్పారు.

ఫైర్ సర్వీసెస్, SDRF, హైడ్రా విభాగాలు విడివిడిగా కాకుండా ఒకే గొడుగు కింద సమన్వయంతో పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. సమన్వయ లోపాల వల్ల సహాయక చర్యలు ఆలస్యం కాకుండా, అన్ని విభాగాలు ఒకే దిశగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ పరిధిలో విపత్తుల నియంత్రణ కోసం హైడ్రా బృందాలను ఇప్పటికే 30 నుంచి 70కి పెంచామని, సిబ్బంది సంఖ్యను కూడా గణనీయంగా పెంచుతున్నామని తెలిపారు.

ప్రజలకు తక్షణ సహాయం అందించేలా రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఏ ప్రాంతంలో విపత్తు సంభవించినా ప్రజలు ఒక్క కాల్‌తో సమాచారం అందించేలా వ్యవస్థ ఉండాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే విషయంలో తెలంగాణను దేశంలోనే ఉత్తమ రోల్ మోడల్‌గా నిలపడం ప్రభుత్వ సంకల్పమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

ALSO READ: Medaram: మహాజాతరకు సర్వం సిద్ధం